బిగ్ డౌట్‌: మోడీ చెప్పిన కొత్త బిల్లు.. నీట్ దోషుల‌కు వ‌ర్తించేనా?

ఈ చ‌ట్టం కింద క‌ఠిన శిక్ష‌లు విధించేలా చూస్తామ‌న్నారు. అంతేకాదు.. శుక్ర‌వారం మంత్రి వ‌ర్గ స‌మావేశంలోనే దీనిని ఆమోదిస్తామ‌ని కూడా చెప్పారు.

Update: 2026-07-24 22:30 GMT

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గురువారం అర్ధ‌రాత్రి విడుద‌ల చేసిన వీడియో సందేశంలో నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ ఘ‌ట‌న‌ను సీరి య‌స్‌గా తీసుకున్నామ‌ని తెలిపారు. విద్యార్థుల జీవితాలు ఇబ్బందిలో కూరుకుపోకుండా ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో వెంట‌నే నీట్ ప‌రీక్ష‌ను మ‌రోసారి నిర్వ‌హించామ‌ని తెలిపారు. ఇక‌, ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీని క‌ట్ట‌డిచేసేందుకు వీలుగా దేశ‌వ్యాప్తంగా అమ‌ల య్యేలా కొత్త చ‌ట్టాన్ని తీసుకురానున్న‌ట్టు ప్ర‌ధాని వివ‌రించారు. ఈ చ‌ట్టం కింద క‌ఠిన శిక్ష‌లు విధించేలా చూస్తామ‌న్నారు. అంతేకాదు.. శుక్ర‌వారం మంత్రి వ‌ర్గ స‌మావేశంలోనే దీనిని ఆమోదిస్తామ‌ని కూడా చెప్పారు.

అన్న‌ట్టుగానే..

ప్ర‌ధాని త‌న సందేశంలో చెప్పిన‌ట్టుగానే ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప‌శ్న‌ప‌త్రాల‌ను లీక్ చేసేవారిని క‌ట్ట‌డి చేస్తూ.. రూపొందించిన బిల్లుకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వ‌ర్గం శుక్ర‌వారం సాయంత్రం ఆమోదించింది. ఈ బిల్లులో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. దీనిని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే తీసుకువ‌చ్చి.. ఉభయ స‌భ‌ల్లోనూ ఆమోదించుకునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. సోమ‌వారం నాడు ప్రారంభ‌మ‌య్యే స‌మావేశాల్లోనే ఈ బిల్లును తీసుకురానున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కొత్త బిల్లులో ఏముంది?

+ వాస్త‌వానికి కొత్త బిల్లు అంటున్నా.. అధికారిక వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇప్ప‌టికే 2024లో తీసుకువ‌చ్చిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల నిబంధ‌న‌ల చ‌ట్టానికి `స‌వ‌ర‌ణ` చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

+ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3-5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

+ దోషులుగా తేలితే.. 10 లక్షల రూపాయ‌ల‌ వరకు జరిమానా విధిస్తారు.

+ అదే ప‌నిగా ప‌దే ప‌దే ఈ నేరానికి పాల్ప‌డితే.. 5-10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

+ అదేవిధంగా ఆస్తుల స్వాధీనంతోపాటు మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు.

ఇప్పుడు వ‌ర్తించేనా?

ఇదే ఇప్పుడు అతి పెద్ద సందేహం. ప్ర‌ధాని మోడీ చెప్పిన‌ట్టు కొత్త బిల్లు తీసుకువ‌చ్చి చ‌ట్టం చేసినా.. ప్ర‌స్తుతం జ‌రిగిన నీట్ పేప‌ర్ లీక్ ఘ‌ట‌న‌కు ఈ చ‌ట్టం వ‌ర్తించ‌బోద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చ‌ట్టం చేసి, దానికి రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేసిన నాటి నుంచే కొత్త చ‌ట్టం ప్ర‌కారం దోషుల‌కు శిక్ష‌లు ప‌డ‌తాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన నీట్ పేప‌ర్ లీక్ ఉదంతంలో ఎవ‌రికీ కొత్త చ‌ట్టం వ‌ర్తించ‌ద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో వారికి పాత చ‌ట్టం ప్ర‌కార‌మే శిక్ష‌లు పడే అవ‌కాశం ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News