బీజేపీలో ఆయన లక్కీ...వారంతా బ్యాక్ బెంచేనా ?

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగం ఉంది. అంటే అధికారం నిండుగా దండిగా ఉంది.

Update: 2026-07-25 04:01 GMT

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగం ఉంది. అంటే అధికారం నిండుగా దండిగా ఉంది. అయినా సరే బీజేపీలో పాత కాపులకు ఎటువంటి పదవీ యోగం దక్కడం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలీ అంటే వైసీపీ హయాంలో బీజేపీలో ఉంటూ గట్టిగా మాట్లాడిన నేతలలో అనేక మంది ఇపుడు బ్యాక్ బెంచీకి పరిమితం అయిపోయారు. అయితే ఒక్క సోము వీర్రాజు మాత్రం రాజకీయ అదృష్టవంతుడు అని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. మరి మిగిలిన వారి సంగతేంటి అంటే జవాబు అయితే ఇప్పట్లో లేదనే అంటున్నారు.

సై అంటే సై అంటూ :

ఆనాడు సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ ధాటీగానే వ్యవహరించేవారు. ఆయన కార్యవర్గంలో కూడా అనేక మంది నాయకులు ఉండేవారు అలాగే ఇతర నేతలు కూడా దూకుడు చేసేవారు. తమకు టీడీపీ అయినా వైసీపీ అయినా ఒక్కటే అని విమర్శలకు వెనకాడే వారు కారు. సోము వీర్రాజు అయితే టీడీపీ మీద గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దానికి ఆయన సామాజిక వర్గం కూడా ప్రధాన కారణం అని అంటున్నారు. అయితే మిగిలిన వారికి మాత్రం ఆ భాగ్యం ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

పాపం అంటున్నారా :

ఇక రాయలసీమలో అనంతపురం జిల్లాకు చెందిన కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన అనేక హోదాలలో పార్టీ పదవులు నిర్వహించారు. పార్టీ మీద ఈగ వాలనీయకుండా పనిచేశారు. సోము వీర్రాజు ప్రెసిడెంట్ గా ఉన్న రోజులలో ఆయన ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. కానీ ఇపుడు ఆయనకు పార్టీ పదవులు తప్పించి ఏ నామినేటెడ్ పదవి కూడా దక్కలేదని ఆయన అభిమానులు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ నుంచి ప్రతీ పదవికీ ఆయన పేరు మొదట గట్టిగా వినిపిస్తూ రావడం చివరిలో తేలిపోవడం గడచిన రెండేళ్ళుగా జరుగుతూనే ఉంది. దాంతో పూర్తి నైరాశ్యంలో ఆయన వర్గం అంతా ఉందని అంటున్నారు. అయినా సరే చేసేది ఏమీ లేదని కూడా అంటున్నారు. పార్టీని నమ్ముకును ముందుకు సాగడమే తప్ప చేసేది ఏదీ లేదని కూడా డిసైడ్ అయి అలాగే మనసు స్వాంతన పరచుకుంటున్నారు.

ఈయన సైతం అంతేనా :

ఇక బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యుడు అయిన జీవీఎల్ నరసింహారావు ఆనాడు సోము వీర్రాజుతో కలసి అనేక ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు బీజేపీ ఎంపీగా జీవీఎల్ హడావుడి కూడా ఒక లెవెల్ లో ఉండేదని అంతా గుర్తు చేసుకుంటారు. ఆయన కూడా అప్పట్లో టీడీపీ మీద విమర్శలు చేస్తూ ఉండేవారు. అయితే అవన్నీ పార్టీ పరంగా సిద్ధాంతపరంగా అయినా ఇపుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆయనకు కూడా ఏ రకమైన పదవి దక్కక పోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయన కూడా రాజ్యసభ సీటు ఆశించారు అని చెబుతారు. దాని కంటే ముందు విశాఖ లోక్ సభ సీటుకి పోటీ చేయాలని రెండేళ్ళ ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకున్నా తీరా పొత్తులతో ఆయనకు సీటు దక్కలేదు. పోనీ నామినేటెడ్ పదవి అయినా ఇస్తారు అని అనుకుంటే ఆ ఆశ కూడా తీరడం లేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే సోము రాజకీయ జాతకం గట్టిగా ఉందని ఒక్కటే అందరికీ అర్ధం అవుతోంది. మరి ఇలాగే అనేక మంది ఇతర నేతలు పాత బీజేపీ నేతలు ఉన్నారు వారి సంగతేంటి అంటే కమలం పువ్వు కేసి చూసి దండం పెట్టడమే అని అంటున్నారు.

Tags:    

Similar News