వైభవ్ 190.. బిహార్ 574.. విజయ్ హజారేలో రికార్డులు బద్దలు
భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ (వీహెచ్‌టీ) రికార్డులతో మొదలైంది..!;
భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ (వీహెచ్‌టీ) రికార్డులతో మొదలైంది..! భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిబంధనల మేరకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సహా టాప్ ఇండియన్ క్రికెటర్లు అందరూ పాల్గొంటున్న ఈ టోర్నీ ఇప్పటికే కళకళలాడుతోంది. దీనికితోడు కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీ, దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ఫైనల్లో మెరుపు సెంచరీతో టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ల విన్యాసాలు చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దీనికితగ్గట్టే బుధవారం బిహార్ దుమ్మురేపింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై ఏకంగా 574 పరుగులు చేసింది. ఈ రెండు జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బిహార్ కు వైభవ్ తుపాను ఆరంభం ఇచ్చాడు. 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్స్ లతో 190 పరుగులు చేసి విరుచుకుపడ్డాడు. ఇతడికి ఆయుష్ లోహ్రూక (56 బంతుల్లో 116, 11 ఫోర్లు, 8 సిక్స్ లు), సకిబుల్ గని (40 బంతుల్లో 128 నాటౌట్, 10, ఫోర్లు, 12 సిక్స్ లు) సెంచరీలతో సహకారం అందించారు. వైభవ్ 36 బంతుల్లో, సకిబుల్ 32 బంతుల్లోనే సెంచరీలు చేసేశారు. లిస్ట్ ఏ క్రికెట్ లో గనిదే అత్యంత వేగవంతమైన సెంచరీ.
దీంతో మూడేళ్ల కిందట తమిళనాడు నెలకొల్పిన 506 పరుగుల విజయ్ హజారే అత్యధిక స్కోరును బిహార్ బద్దలు కొట్టంది. చిత్రం ఏమంటే.. అప్పుడు తమిళనాడు ప్రత్యర్థి అరుణాచల్ ప్రదేశ్ కావడం.
మూడు రోజుల కిందట ఫెయిల్.. నేడు హిట్
దుబాయ్ లో ఆదివారం జరిగిన ఆసియా కప్ అండర్-19 టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ పై 26 పరుగులే చేసి విఫలమైన వైభవ్ సూర్యవంశీ ఆ వెంటనే స్వదేశానికి వచ్చి విజయ్ హజారే ట్రోఫీలో దిగాడు. అంతేకాదు.. ఏకంగా 190 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడు ఇతడే. వైభవ్ ప్రస్తుత వయసు 14 ఏళ్ల 272 రోజులు. ఇంతకుముందు 1986లో జహూర్ 15 ఏళ్ల 209 రోజుల వయసులో సెంచరీ కొట్టాడు.
ఇషాన్ మళ్లీ దుమ్మురేపాడు...
విజయ్ హజారేలో భాగంగా కర్ణాటకతో అహ్మదాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గత బుధవారం ముస్తాక్ అలీ ఫైనల్లోనూ ఇషాన్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 39 బంతుల్లో 125 పరుగులు చేసిన ఇషాన్... 14 సిక్సు లు బాదాడు. ఏడు ఫోర్లు కొట్టాడు. దీంతో జార్ఖండ్ 412 పరుగుల భారీ స్కోర్ చేసింది.