తండ్రేమో సీఎం తోలు తీస్తానంటాడు.. కొడుకేమో మగాడేనా అంటాడు

చెప్పే శ్రీరంగనీతులకు చేసే పనులకు ఏ మాత్రం పొంతనలేని తీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన కుమారరత్నం కేటీఆర్ లోకొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.;

Update: 2025-12-24 07:30 GMT

చెప్పే శ్రీరంగనీతులకు చేసే పనులకు ఏ మాత్రం పొంతనలేని తీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆయన కుమారరత్నం కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. తరచూ తన తండ్రిని విమర్శించిన వారిని ఉద్దేశించి.. మర్యాదగా మాట్లాడరా?అంటూ విరుచుకుపడుతుంటారు కేటీఆర్. మర్యాద కోసం అంతలా పాకులాడే ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సబబేనా? అన్నది ప్రశ్న.

రెండేళ్ల మౌనాన్ని బ్రేక్ చేస్తూ.. మూడు రోజుల క్రితం మీడియా సమావేశాన్ని నిర్వహించిన గులాబీ బాస్ కేసీఆర్.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి తోలు తీస్తానని వ్యాఖ్యానించటం తెలిసిందే. రెండేళ్లు ఆగానని.. ఇకపై తాను మౌనంగా ఉండదలుచుకోలేదంటూ సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. గడిచిన రెండేళ్లుగా వివిధ అంశాలపై మాట్లాడాలని.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్.. విపక్ష నేత కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడటం తెలిసిందే. కేసీఆర్ ఓకే చెప్పాలే కానీ ఇరిగేషన్ మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పినప్పుడు.. అందుకు ఓకే చెబుతూ కేసీఆర్ ప్రకటన ఎందుకు చేయలేదు? అన్నది ప్రశ్నగా మారింది.

ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలు అంశం ఏదైనా సరే.. కేసీఆర్ ఓకే చెబితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడదామని ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే కోరటం తెలిసిందే. ఈ ప్రకటనలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని కేసీఆర్.. రెండేళ్ల తర్వాత తెర మీదకు వచ్చి.. ఇకపై తోలు తీస్తానని వ్యాఖ్యానించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. పదేళ్లు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ ను ఉద్దేశించి ఎవరైనా ఘాటు విమర్శ చేసినంతనే అటు కేసీఆర్.. ఇటు ఆయన కొడుకు కేటీఆర్ లు ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల గురించి క్లాసులు పీకేవాళ్లు.

అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం సబబేనా? అన్నది ప్రశ్న. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. సీఎంగా ఉన్న నేతను ఉద్దేశించి ఇంతలా మాట్లాడటం సబబేనా? అన్న ప్రశ్న రాక మానదు. తాజాగా పార్టీ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్.. దమ్ముంటే ముఖ్యమంత్రి సహకార ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు.

గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా రైతులతో పాటు.. వ్యవసాయ కూలీలు.. కౌలు రైతులు ఉన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి సహకార ఎ్ననికల్ని నిర్వహించటం లేదని విమర్శించారు. ఇలాంటి విమర్శల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ.. కేటీఆర్ ఈ తరహా విమర్శలతో ఆగలేదు. ముఖ్యమంత్రి మగాడైతే తమపై కేసులు పెట్టాలని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులు పెడతామని రోజుకో లీడ్ ఇస్తున్నట్లుగా పేర్కొన్న కేటీఆర్.. ‘‘సీఎం రేవంత్ మగాడైతే కేసులు పెట్టాలి. హోం మంత్రి కూడా ముఖ్యమంత్రే. శిఖండి రాజకీయాలు చేయొద్దు.చిట్ చాట్ లు మాట్లాడొద్దు. సీఎంకు ధైర్యం ఉంటే కెమేరా ముందు వచ్చి కేసులు పెడతామని చెప్పాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు కేటీఆర్ లో అహంకారం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎదుటోళ్ల నుంచి మర్యాదను ఆశించే వేళ.. తాను కూడా కించిత్ మర్యాదతో వ్యవహరించాలన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మిస్ అవుతారు?

Tags:    

Similar News