‘తమ్ముళ్ల’కు చేయిచ్చి..జగన్ పార్టీ నేతలకు మర్యాదా?

Update: 2016-05-29 04:59 GMT
కూసింత అధికారం చేతికి రాగానే చెలరేగిపోయే నేతలు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. అలాంటి అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని.. ఆయన కృపకు పాత్రుడు కావాలని ఫీలైతే.. అందుకు టీటీడీ అధికారుల వ్యవహరించి తీరుపై తెలుగు తమ్ముడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అవమానం మీద గళం విప్పటమే కాదు.. టీటీడీ బోర్డు సెల్ ఎదుట నిరసన వ్యక్తం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తిరుపతిలో మహానాడు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పనితో పాటు.. పుణ్యం కూడా ఎంతోకొంత మూట కట్టుకోవాలన్న ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లు తిరుమల కొండ బాట పట్టటం తెలిసిందే. తమ్ముళ్ల దెబ్బకు తిరుమల కొండ మీద రూమ్ లు దొరక్క యాత్రికులు నానా బాధలు పడుతున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చిన పరిస్థితి. దీంతో ఆయన స్పందించి.. రూముల్లో అడ్జెస్ట్ అయి.. వీలైనన్ని రూముల్ని ఖాళీ చేయాలంటూ తమ్ముళ్లను కోరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ప్రయత్నించిన అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీటీడీ అధికారులు నో చెప్పేశారు.

ఓవైపు జగన్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనం టిక్కెట్లు జారీ చేసిన అధికారులు.. తనకు మాత్రం లేదని చెప్పటంపై ఆయన సీరియస్ అయ్యారు. టీటీడీ అధికారుల తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట నిరసన చేయటం సంచలనంగా మారింది. అయినా.. అదికార ఎమ్మెల్యేకే బ్రేక్ దర్శనానికి నో చెప్పటం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. అధికారపక్షానికి చెందిన తమకు విలువ ఇవ్వకుండా.. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వటం ఏమిటంటూ సూరి సీరియస్ అవుతున్నారు. మరి.. తమ్ముళ్ల ఆగ్రహంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News