సీఎంను వదిలేసి గవర్నర్ మీద పడ్డారే

Update: 2017-01-24 10:18 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తీరు కాస్త భిన్నంగా ఉంటుంది.ఎక్కడ లెక్క తేడా వచ్చిందో కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అంటే చాలు ఆయన మహా చిరాకు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన మీద విమర్శలు సంధిస్తుంటారు. నిజానికి ఆయనకు సంబంధం లేని అంశాల్ని ఆయనకు అపాదించే చిత్రమైన వైఖరి వీహెచ్ లో కనిపిస్తుంటుంది.

తాజాగా అలాంటి వ్యాఖ్యనే చేశారు వీహెచ్. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కారు.. మొదట్లో ఒక రోజు అందరికి సెలవు ఇచ్చేసి సమగ్ర సర్వేను నిర్వహించటం తెలిసిందే. తాను చేపట్టిన ఈ సర్వేతో చాలా విషయాలు బయటకు వస్తాయంటూ కేసీఆర్ చెప్పినప్పటికీ.. ఆ సర్వే వివరాల్ని ఇప్పటివరకూ వెల్లడించింది లేదు. దాదాపుగా అందరూ మర్చిపోయిన ఈ విషయాన్ని తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన వీహెచ్.. నెలరోజుల్లోపు సర్వే వివరాల్ని బయటపెట్టాలన్నారు. లేనిపక్షంలో రాజ్ భవన్ ఎదుట దీక్ష చేస్తానని వ్యాఖ్యానించారు.

నిజానికి వీహెచ్ లేవనెత్తిన వ్యవహారానికి.. గవర్నర్ కు ఏ మాత్రం సంబంధం లేదు. సర్వే వివరాల్ని బయటపెట్టాలనుకుంటే ముఖ్యమంత్రి ఓకే అంటే బయటకు వస్తాయి. ఇలాంటప్పుడు ముఖ్యమంత్రి ఇంటి ఎదుట దీక్ష చేస్తానని చెప్పాల్సింది పోయి.. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ ఎదుట దీక్ష చేస్తానని చెప్పటం ఏమిటి?సంబంధం లేని ఇష్యూలోకి గవర్నర్ ను  లాగటమేమిటి చెప్మా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News