సచివాలయ సేవలకు ఐరాస మద్దతు !

Update: 2020-08-17 13:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రతి పథకాన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో , అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమల్లోకి తెచ్చిన  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఐక్యరాజ్య సమిత దృష్టిని ఆకర్షించింది. సచివాలయ సేవలకు సహకారం అందించేందుకు ఐరాస అనుబంధ విభాగాలు ముందుకొచ్చాయి. దీనిపై సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల మధ్య చర్చలు జరపనున్నారు.

ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వం మరో విడత శాఖాపరమైన శిక్షణ నిర్వహించబోతోంది. వివిధ అంశాలపై  ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి శాఖ విధులకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్‌ లేదా ఆ పైస్థాయి అధికారితో శిక్షణ ఇవ్వనున్నారు. 6 నుంచి 12 రోజుల పాటు ఈ శిక్షణ జరగనుండగా.. ట్రైనింగ్ ముగిసిన తరువాత ఆన్‌ లైన్ ‌లో పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ప్రతి 30 మందిని ఒక బ్యాచ్ ‌గా ఏర్పాటు చేసి వారు పనిచేసే ప్రాంతంలో ప్రత్యక్షంగా, గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారికి ఆన్ ‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు సెప్టెంబర్‌ 5 వరకు విడతల వారీగా   కొనసాగుతాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు.

ఇకపోతే , గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్ ‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి నేడు ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా , కెనరా బ్యాంక్‌ ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్‌ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
Tags:    

Similar News