నిమిషానికి 2లక్షల పిజ్జాలు, 1,336 బిర్యానీల ఆర్డర్...న్యూఇయర్ రికార్డ్

ఏటా డిసెంబర్ 31న ఈ వేడుకలు తప్పనిసరి. ఇదంతా విశేషం కాదు కానీ...దేశంలో డిసెంబర్ 31న రికార్డ్ స్థాయిలో ఫుడ్ లవర్స్ బిర్యానీ, పిజ్జాలు ఆర్డర్లిచ్చారు.;

Update: 2026-01-01 12:43 GMT

తుళ్ళింతలు, కేరింతల హోరు నడుమ దేశ ప్రజలు పాత సంవత్సరానికి అల్విదా...కొత్త సంవత్సరానికి వెల్ కమ్ పలికారు. డిసెంబర్ 31 దేశంలో పలు మెట్రోపాలిటిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు కూడా న్యూఇయర్ వేడుకలతో దద్దరిల్లిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో బీర్లు ఏర్లుగా పొంగిపొర్లాయి. పబ్ లు గానా బజానాలతో మోతెక్కాయి. ఏటా డిసెంబర్ 31న ఈ వేడుకలు తప్పనిసరి. ఇదంతా విశేషం కాదు కానీ...దేశంలో డిసెంబర్ 31న రికార్డ్ స్థాయిలో ఫుడ్ లవర్స్ బిర్యానీ, పిజ్జాలు ఆర్డర్లిచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...డిసెంబర్ 31న ఫుడ్ లవర్స్ వివిధ తిళ్ళు ఆర్డర్ పెట్టినా...బిర్యానీదే టాప్ అట. దేశంలోనే టాప్ ఆర్డర్ లో బిర్యానీ నిలుస్తోందని ఆన్ లైన్ ఫుడ్ సర్వ్ చేసే స్విగ్గీ ప్రకటించింది. ప్రతి నిమిషానికి అక్షరాల 2 లక్షల పిజ్జాలు, 1,336 బిర్యానీల ఆర్డర్ చేశారంటే మన తిండిప్రియుల సత్తా ఏంటో తెలుస్తోంది.

న్యూఇయర్ వేడుకలు...డిసెంబర్ 31 సాయంత్రం నుంచే ప్రారంభం అయ్యాయి. మందుబాబులు రెచ్చిపోయి రచ్చరంబోలా చేశారు. క్లబ్ లలో పబ్ లలో ఆట పాట గానా బజానాలకు అంతేలేదు. ఆకాశమే హద్దుగా...సమయం లేదు మిత్రమా అన్నట్లు ఫుల్ ఫన్ స్టార్మ్ లో మునిగితేలారు. మెట్రె నగరాలు...పాట్నా, సూరత్, వడోదరా, నాగపూర్, జైపూర్, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సాయంత్రం నుంచే హంగామా షురూ చేసేశారు. అప్పట్నుంచే బిర్యానీ, పిజ్జాలు, కేకులు, బర్గర్లను రెచ్చిపోయి ఆర్డర్ చేశారు. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లపైనే న్యూఇయర్ కేకులు అమ్మకాలకు పెట్టారు. చాలా మంది వినియోగదారులు క్వాలిటీ ఉన్న కేకులే కావాలని వాటికోసమే ఎగబడ్డం కనిపించింది.

బిర్యానీ, పిజ్జాలే కాకుండా...బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో రసమలై, గులాబ్ జామూన్ లను కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు పెట్టారు. రెస్టారెంట్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. స్విగ్గీ దేశవ్యాప్తంగా విస్తృతంగా తన సేవలు అందించింది. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బిర్యానీ అన్నిటికన్నా టాప్ లో నిలిచింది. రాత్రి 7.30 గంటల సమయంలోనే రికార్డు స్థాయిలో 2,18,336 ఆర్డర్లు వచ్చాయి. టైమ్ గడుస్తున్న కొద్దీ డిమాండ్ అంతకంతకు పెరిగిపోయినట్లు స్విగ్గీ తెలిపింది. రాత్రి 8 గంటల సమయంలో కేవలం ఒక నిమిషంలో 1,336 ఆర్డర్లు బుక్ అయినట్లు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భువనేశ్వర్ లో ఓ కస్టమర్ సింగిల్ ఆర్డర్ లో 16కేజీల బిర్యానీ ఆర్డర్ ఇచ్చారంటే ....క్రేజీ ఏ రేంజిలో ఉందో అర్థమవుతోంది. అలాగే పిజ్జాలు, బర్గర్లకు కూడా పోటాపోటీగా ఆర్డర్లు పెడుతునే ఉన్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో 2.18 లక్షల పిజ్జాలు డెలివరీ అయ్యాయి. బర్గర్లు 2.16 లక్షల దాకా డెలివరీ చేశారు. దేశంలో తిండి ప్రియుల కోరికలు ఏ స్థాయిలో ఉందో ఈ ఆర్డర్లను పరిశీలిస్తే అర్థమవుతుంది.

వ్యక్తిగత ఆర్డర్లు కూడా ఇదే స్థాయిలో ఉండటం విశేషం. బెంగళూరులో ఓ కస్టమర్ వంద బర్గర్లను ఆర్డరిచ్చి తన జిహ్వచాపల్యాన్ని ప్రదర్శిస్తే....గోవాకు చెందిన మరో భోజన ప్రియుడు ఏకంగా 39 పెద్ద పెద్ద కబాబ్ లు, టిక్కాలను ఆర్డరిచ్చాడు. గుర్ గావ్ లో ఓ వ్యక్తి 18 బాక్సుల బ్రౌనీ, ప్లమ్ కేకులకు కావాలన్నాడు. నాగపూర్ లో నిన్న ఒక్క రోజే ఓ వ్యక్తి 93 సార్లు ఫుడ్ అయిటెమ్స్ ఆర్డరిచ్చాడు. సూరత్ కు చెందిన ఓ వినియోగదారుడు కాస్త విభిన్నంగా 22 రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డరిచ్చాడు. ఈ వింతలు విశేషాలన్నీ కేవలం డిసెంబర్ 31న నాడే జరగడం మరో విశేషం. ఇక బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో స్విగ్గీ డొనట్స్ ఆర్డర్లలో రికార్డు సృష్టించింది. అహమ్మదాబాద్, లక్నో, జైపూర్ లలోనూ ఆర్డర్లు పిచ్చెక్కించాయి. వడోదర, చంఢీఘర్ నగరాల్లో తలో 30 పార్టీలు గ్రాండ్ గా జరిగాయి.ముంబైలో ఓ కస్టమర్ దాదాపు లక్షరూపాయల దాకా బిల్లు చేశాడు. చెన్నైలో 50శాతం, పూణేలో 61.3శాతం డైనింగ్ బిల్లులు చెల్లించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చివరాఖరికి తెలిసొచ్చేదేమంటే...మనవాళ్ళు మహా తిండిప్రియులు. వేడుకలొస్తే తినడం కాదు...తినడం కోసమే వేడుకలు అన్నట్లుంటారు. 2026 కొత్త సంవత్సరం భోజనప్రియుల రికార్డులతో ఎంట్రీ ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News