గిగ్ వర్కర్ల సమ్మె మాటకు ‘టిప్’ తో కొట్టిన సంస్థలు
ఏది ఏమైనా యాపారం యాపారమే. చేతిలో డబ్బులున్నోడు ఏమైనా చేస్తాడు.. ఎలాంటి పరిస్థితిని అయినా ఇట్టే డీల్ చేస్తాడన్న మాటకు తగ్గట్లే.. తాజాగా ఈకామర్స్ సంస్థలు చేతల్లో చూపించాయి.;
ఏది ఏమైనా యాపారం యాపారమే. చేతిలో డబ్బులున్నోడు ఏమైనా చేస్తాడు.. ఎలాంటి పరిస్థితిని అయినా ఇట్టే డీల్ చేస్తాడన్న మాటకు తగ్గట్లే.. తాజాగా ఈకామర్స్ సంస్థలు చేతల్లో చూపించాయి. కొన్నేళ్ల క్రితం వరకు గిగ్ వర్కర్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎప్పుడైతే ఈ-కామర్స్ సంస్థల జోరు పెరిగిందే.. డెలివరీ బాయిస్ వ్యవహారం అంతకంతకూ ప్రాధాన్యత సంతరించుకోవటమే కాదు.. వారి గురించి ప్రభుత్వాలు సైతం ఆలోచించే పరిస్థితి.
కోట్లాది రూపాయిలు ఆర్జిస్తున్నా.. తమకు ఇచ్చే డెలివరీ చార్జీల విషయంలో సంస్థలు వ్యవహరించే తీరుకు విసిగిన గిగ్ వర్కర్లు.. ఏడాది మొత్తంలో కీలకమైన డిసెంబరు 31ను టార్గెట్ గా పెట్టుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగుతామని గిగ్ వర్కర్లు వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో.. డిసెంబరు 31 గండాన్ని ఎలా ఈ-కామర్స్ సంస్థలు ఎలా అధిగమిస్తాయన్న ఉత్కంట నెలకొంది. అయితే.. ఈ సమ్మె వార్నింగ్ ను డెలివరీ సంస్థలు ఎలా డీల్ చేస్తాయన్నది ప్రశ్నగా మారింది.
దీనికి ఆయా సంస్థలు సింఫుల్ గా తేల్చేశాయి. మిగిలిన రోజుల సంగతిని పక్కన పెడితే.. తమ వ్యాపారాలకు ఎంతో కీలకమైన డిసెంబరు 31 రాత్రి.. అది కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి అర్థరాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిగ్ వర్కుర్లు చేసే డెలివరీ ఒక్కొక్క దానికి రూ.120 నుంచి రూ.150 చొప్పున చెల్లిస్తామని జొమాటో తెలిపింది. ఇదే రీతిలో మిగిలిన సంస్థలు తమదైన శైలిలో గిగ్ వర్కర్లకు ఒక్కరోజు తాయిలాలు ప్రకటించాయి,
దీంతో.. తమ సమ్మెతో ఈ కామర్స్ సంస్థకు షాకిస్తామని భావించిన వారికి.. ఉల్టా సంస్థలే గిగ్ వర్కర్లకు టిప్ లాంటి మొత్తంతో రివర్సు షాకిచ్చాయని చెప్పాలి. డిసెంబరు 31 రాత్రి పెంచిన మొత్తంతో ఒక్కో గిగ్ వర్కర్ రూ.3 వేలు సంపాదించేలా ఈ కామర్స్ సంస్థలు ప్లాన్ చేశాయి. దీంతో స్విగ్గీ.. జొమాటో తో పాటు పలు సంస్థల డెలివరీ బాయిస్ ఎలాంటి ఆటంకం కలగకుండా.. భారీగా ఇస్తామన్న టిప్ కోసం ఒళ్లు వంచి మరీ పని చేశారు. సమ్మె వార్నింగ్ ను పక్కన పెట్టేశారు. అందుకే.. యాపారస్తుడి తెలివే తెలివి.