రూ.600 లంచానికి ఏడాది జైలు శిక్ష
ఈ కేసు 2011లో జరిగింది. ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి.. ఒక పౌరుడికి రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ ను ప్రాసెస్ చేయడానికి రూ.600 లంచం డిమాండ్ చేశాడు.;
కోట్లకు కోట్లు లంచాలుగా మింగేసే వారినే నిరూపించలేని.. శిక్ష వేయించలేని వ్యవస్థలో ఉన్నాం.. కానీ రూ.600 లంచం తీసుకున్న ఓ చిరు ఉద్యోగిని పక్కా సాక్ష్యాలతో కటకటాలకు పంపి నేరం రుజువు చేయించి మరీ శిక్ష వేయడం.. కోర్టు డబ్బుల కంటే అవినీతిని హైలెట్ చేయడంతో ఈ కేసు దేశంలో సంచలనం సృష్టించింది.
అవినీతికి మొత్తం ఎంత అనేది ముఖ్యం కాదు.. ఆ ఉద్దేశమే నేరమని పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.. కేవలం రూ.600 లంచం తీసుకున్న కేసులో ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది కఠిన కారాగార శిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది.
అసలేం జరిగింది.
ఈ కేసు 2011లో జరిగింది. ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి.. ఒక పౌరుడికి రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ ను ప్రాసెస్ చేయడానికి రూ.600 లంచం డిమాండ్ చేశాడు. తన ధర్మం ప్రకారం చేయాల్సిన పనికి డబ్బు అడగడంతో ఆగ్రహించిన బాధితుడు వెంటనే సీబీఐ అధికారులను ఆశ్రయించాడు.
రంగంలోకి దిగిన సీబీఐ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత
బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు పక్కా వ్యూహంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. రసాయనాలు పూసిన నోట్లను బాధితుడికి ఇచ్చి పంపగా.. ఆ ఉద్యోగి సదురు మొత్తాన్ని తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెగ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న సమయంలో రికార్డ్ చేసిన ఆడియో, వీడియో దృశ్యాలు .. నిందితుడి వేలిముద్రలు, వాయిస్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షించి నేరాన్ని నిర్ధారించారు.
12మంది సాక్షులు.. తిరుగులేని ఆధారాలు
ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం 12 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. సీబీఐ అధికారులు సమర్పించిన సాక్ష్యాలు అత్యంత విశ్వసనీయంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడు ప్రజా సేవకుడు అయ్యి ఉండి కూడా తన బాధ్యతను విస్మరించి లంచం ఆశించడం క్షమించరాని నేరం అని కోర్టు పేర్కొంది.
నేరం నేరమే.. కోర్టు ఘాటు వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా నిందితుడి తరుఫు లాయర్లు లంచం మొత్తం చాలా తక్కువ అని వాదించినప్పటికీ పట్నా హైకోర్టు దాన్ని తోసిపుచ్చింది. "లంచం మొత్తం ఎంత అనేది ఇక్కడ ముఖ్యం కాదు. అది ఒక రూపాయి అయినా లేదా ఒక కోటి రూపాయలు అయినా, అవినీతి అన్నది వ్యవస్థను దెబ్బతీసే పెద్ద నేరమే. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత ఉండాలి" అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం.. నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నిందితుడు వెంటనే లొంగిపోవాలని.. మిగిలిన శిక్షా కాలాన్ని జైలులో గడపాలని ఆదేశించింది.
ఈ తీర్పుతో సామాన్య ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరగడమే కాకుండా.. చిన్న మొత్తమే కదా అని లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గట్టి సందేశం అందింది. అవినీతిపై రాజీ పడకూడదనే పౌర సమాజ ఆకాంక్షను ఈ తీర్పు ప్రతిబింబిస్తోంది.