సంక్రాంతికి తెలంగాణలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ఎంట్రీ?
కేబుల్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ తో అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు వీలుగా స్టార్ లింక్ తో జత కట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.;
పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన వైర్ లెస్ ఇంటర్నెట్ సేవల్ని అందించే స్టార్ లింక్ సంస్థ.. తెలంగాణలోకి అడుగు పెట్టబోతోందా? దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తి అయిన విషయం తాజాగా వెలుగు చూసింది.అంతేకాదు.. ఈ సంక్రాంతికి పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో ఈ సేవల్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కేబుల్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ తో అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు వీలుగా స్టార్ లింక్ తో జత కట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించలేని పరిస్థితి. అంతేకాదు..మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్నెట్ అందించలేని పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు స్టార్ లింక్ కంపెనీ సహకారంతో ఆయా గ్రామాలకు 5జీ సేవల్ని అందేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే స్టార్ లింక్ కంపెనీ ప్రతినిధులు.. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్య రెండుసార్లు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించాలి? అక్కడున్న పరిస్థితుల సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్టార్ లింక్ సంస్థ సుముఖత వ్యక్తం చేశారని.. ఇందులో భాగంగా సంక్రాంతికి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు వీలుగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామంలో వైర్ లెస్ 5జీ వైఫై సేవల్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అవసరమైన అనుమతుల్ని కేంద్రం ఇప్పటికే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన ఐదు నెలలుగా వైర్ లెస్ 5జీ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిన అంశాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దీనిపై స్పందించిన కేంద్రం.. పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచన చేసింది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. రామక్రిష్ణాపురంలో పైలెట్ ప్రాజెక్టు చేపడతారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ తరహా పైలెట్ ప్రాజెక్టు దేశంలోనే ఇదే మొదటిదిగా చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 5జీ వైర్ లెస్ ఇంటర్నెట్ అందించేందుకు టీ ఫైబర్.. ఐఐటీ హైదరాబాద్ మధ్య ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. ఏమైనా.. కొత్త ఏడాది కొంగత్త సాంకేతిక తెలంగాణకు పరిచయం కానుంది. దీని ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని చెప్పాలి.