నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్ పై చార్జిషీట్?

ఏపీలో సంచలనంగా మారిన నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.;

Update: 2026-01-01 08:27 GMT

ఏపీలో సంచలనంగా మారిన నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో సూత్రధారి అద్దేపల్లి జనార్దనరావు ఆయన బ్రదర్ నుంచి వైసీపీ నేత కం మాజీ మంత్రి జోగి రమేశ్ కు ప్రతి నెలా ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కోవటం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి సిట్ అధికారులు జోగి బ్రదర్ మీద సుమారు వంద పేజీలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్ ను దాఖలు చేశారు.

విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించిన ఇందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి. డిసెంబరు ఐదున సిట్ అధికారులు ఎనిమిది మంది నిందితులపై తొలి చార్జిషీట్ ను దాఖలు చేయగా.. తర్వాత ముగ్గురు నిందితులపై డిసెంబరు పన్నెండున తొలి సప్లిమెంటరీ చార్జిషీట్ ను సమర్థించారు. ఇందులో జోగి రమేశ్ ను ఏ18గా.. ఆయన సోదరుడు రామును ఏ19గా పేర్కొన్నారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దుపల్లి జనార్థనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావులతో జోగి రమేశ్ సోదరులకు ఉన్న బంధాన్ని వివరంగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అద్దెపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్ కు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముడుపులు అందుకున్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం.

అంతేకాదు.. 2021 నుంచి నకిలీ మద్యాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు ఎలా షురూ చేశారన్న వివరాల్ని కూడా చార్జిషీట్ లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో మొత్తం పదమూడు మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2023 - 25 మధ్య కాలంలో అద్దేపల్లి సోదరులు.. జోగికి మధ్య ఏకంగా ఏడు వేల ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగిన విషయాల్ని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. చార్జిషీట్ లో పేర్కొన్న వెలుగు చూసిన కొన్ని అంశాలే సంచలనంగా మారిన వేళ.. మొత్తం వివరాలు వెలుగు చూస్తే? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News