తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ పెద్దదే!
ఎలాంటి అంచనాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో తొమ్మిది మంది గవర్నర్లను మార్చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.;
ఎలాంటి అంచనాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో తొమ్మిది మంది గవర్నర్లను మార్చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. పశ్చిమబెంగాల్ గవర్నర్ గా వ్యవహరిస్తునన సీవీ ఆనందబోస్ ఆకస్మిక రాజీనామాతో మార్పులు చేపట్టిన కేంద్రం.. పనిలో పనిగా పలు మార్పులకు తెర తీసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న జిష్ణుదేవ్ వర్మ స్థానంలో రాజకీయ కురువృద్ధుడిగా పేరున్న శివ్ ప్రతాప్ శుక్లాను ఎంపిక చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన్ను తెలంగాణకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకూ శివ్ ప్రతాప్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయనకు యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ తో ఉన్న పంచాయితీ ఏంటి? వీరిద్దరి మధ్యనున్న పంచాయితీకి మోడీషాలు ఎంత తెలివిగా చెక్ పెట్టారన్నది చూస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పుర్ జిల్లా రుద్రాపుర్ గ్రామంలో జన్మించిన శివ్ ప్రతాప్ శుక్లా కరుడుగట్టిన బీజేపీ వాది. సంఘ్ పరివార్ తో బలమైన అనుబంధం ఎక్కువ. 1975లో ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్టు కావటమే కాదు.. పందొమ్మిది నెలలు జైలుశిక్షను అనుభవించారు. విద్యాపరంగా చూస్తే.. లా పట్టాను అందుకున్న ఆయన.. బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పని చేశారు.1983లో బీజేపీలో చేరిన ఆయన.. 1989లో మొదటిసారి గోరఖ్ పుర్ నగర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయనకు.. అప్పటి కల్యాణ్ సింగ్ నాయకత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయ మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత మరో రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. కల్యాణ్ సింగ్ ప్రభుత్వంతో పాటు.. రామ్ ప్రకాశ్ గుప్తా.. రాజ్ నాథ్ ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా వ్యవహరించారు.
యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. అన్నింటికి మించి ఎంపీగా పోటీ చేసిన సమయంలో.. శుక్లా ఓటమికి యోగి పని చేశారన్న ఆరోపణ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పంచాయితీ మొదలైంది. ఈ విభేదాలకు చెక్ పెట్టటంతో పాటు.. పార్టీకి అత్యంత విధేయుడైన ఆయనకు తగిన మర్యాదను ఇస్తూ.. రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్రానికి ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేలా చేశారు. 2017 సెప్టెంబరులో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2022 జులై 5వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన రాజ్యసభ సభ్యుడి హోదా ముగిసింది. కాస్త గ్యాప్ తర్వాత 2023 ఫిబ్రవరి 18న ఆయనకు కొత్త తరహా బాధ్యతలు అప్పగించటంతో పాటు.. రాజకీయాలు.. పార్టీతో సంబంధం లేని గవర్నర్ పోస్టును కట్టబెట్టారు. 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించటం ద్వారా యూపీలో యోగి వర్సెస్ శుక్లా పోరుకు గౌరవప్రదమైన రీతిలో చెక్ పెట్టారని చెప్పాలి. తాజాగా తెలంగాణకు ఆయన బదిలీ అయ్యారు. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శుక్లాను తెలంగాణకు వ్యూహాత్మకంగా తీసుకొచ్చారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
రాజకీయ ప్రస్థానంలో ఆయనకు క్లీన్ చిట్ ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. యోగితో నెలకొన్న విభేదాలు మినహా తీవ్రమైన ఆరోపణలు లేవు. అయితే.. రాజకీయాల్లో దశాబ్దాల తరబడి వివిధ హోదాల్లో పని చేసిన శుక్లాకు తనదైన స్వతంత్రతతో వ్యవహరిస్తారన్న పేరుంది. కొన్ని నిర్ణయాల విషయంలో ఆయన తనదైన రీతిలో రియాక్టు కావటం కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించిన తీరును ఇక్కడ చెప్పాల్సిందే. తెలంగాణలో మాదిరే హిమాచల్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంతో అధికారంలో ఉంది.
అక్కడి ప్రభుత్వంతో కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా.. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం అంశంలో ఆయన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదించారు. అంతేకాదు.. ఈ నెల మొదట్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలోనికొన్ని పేరా గ్రాఫ్ లను చదవకుండా వదిలేయటం చర్చకు తెర తీసింది. మొత్తంగా తనదైన స్వేచ్ఛను అనుభవిస్తూ.. తనకు నచ్చని విషయంలో తన వైఖరిని స్పష్టంగా వెల్లడించే విషయంలో అస్సలు మొహమాటపడని సీనియర్ నేతగా శుక్లాను చెప్పొచ్చు.