తిరుమలలో దివ్వెల మాధురి ఎపిసోడ్ .. కావాలనే కాంట్రావర్సీ..!!

తిరుమల క్షేత్రంలో వ్యక్తిగత వేడుకలు, కేక్ కటింగ్స్, ఫోటో షూట్‌లపై స్పష్టమైన నిషేధం ఉంది.;

Update: 2026-03-06 13:06 GMT

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రేయసి, బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. బిగ్ బాస్ రన్నరప్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్‌లో దివ్వెల మాధురి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్‌గా వెళ్లిన దివ్వెల మాధురి సీరియల్ నటి తనూజకి అత్యంత సన్నిహితురాలుగా మారారు. ఈ నేపథ్యంలో తనూజ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో ఈ ఇద్దరూ కేక్ కటింగ్ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల కొండపై కేక్ కట్ చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా తనూజతో కేక్ కట్ చేయించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

ఎమ్మెల్సీ దువ్వాడ సన్నిహితురాలిగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన దివ్వెల మాధురి ఎప్పటికప్పుడు కాంట్రావర్సీలకు కేంద్రంగా మారుతున్నారని అంటున్నారు. డిజిటల్ మీడియాకు తరచూ ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఎమ్మెల్సీ శ్రీనివాస్ తో కలిసి హంగామా చేయడం ద్వారా దివ్వెల మాధురి ఎప్పుడూ టాప్ ఆఫ్ ద టు స్టేట్స్ గా నిలుస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమలలో రీల్స్ చేసినందుకు మాధురిపై కేసులు నమోదయ్యాయి. తాజా వివాదం కారణంగా ఆమె మరోసారి విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుమల క్షేత్రంలో వ్యక్తిగత వేడుకలు, కేక్ కటింగ్స్, ఫోటో షూట్‌లపై స్పష్టమైన నిషేధం ఉంది. గతంలో కూడా రీల్స్ చేసినందుకు మాధురిపై కేసులు నమోదైనా ఆమె తీరులో మార్పు రాకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాల ద్వారా పాపులారిటీ ప్రయత్నించడానికి ఇలాంటివి చేస్తున్నారా? అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు. పాత కేసుల నిమిత్తం తిరుపతి కోర్టుకు హాజరవుతూనే, మరోపక్క మళ్ళీ నిబంధనలను అతిక్రమించి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం కేవలం పబ్లిసిటీ కోసమేనన్న విమర్శలు వస్తున్నాయి. తిరుమల పవిత్రత కంటే సోషల్ మీడియా వ్యూస్, అటెన్షన్ కే ఆమె ప్రాధాన్యమిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇక తాజాగా దివ్వెల మాధురి, తనూజ ఎపిసోడ్ తో తిరుమల క్షేత్ర వైభవంపై విస్తృత చర్చ జరుగుతోంది. కొండపై శ్రీవారి విశేషాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తప్ప, మరేదీ చిత్రీకరించకూడదని నిబంధనలు ఉన్నాయని అంటున్నారు. కానీ, కొందరు భక్తులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రీవెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలను ఇల వైకుంఠంగా భావిస్తారు. ఇటువంటి పవిత్ర క్షేత్రంలో రీల్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దివ్వెల మాధురి ఒక్కరే కాదు ఇటీవల కాలంలో ఇటువంటి వారు ఎక్కువైపోవడం తిరుమల అధికారులకు తలనొప్పిగా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News