జాతీయ రాజకీయాలకు చంద్రబాబు.. ఈ ప్రచారం ఎక్కడ పుట్టింది? కారణం ఏంటి?

చంద్రబాబు తలచుకుంటే ఎప్పుడో రాజకీయాల్లోకి వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఆయనకు ఆ అవసరం ఏంటి? అని టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.;

Update: 2026-03-06 12:00 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో చంద్రబాబు కూడా త్వరలో జాతీయ రాజకీయాల్లో ప్రవేశించనున్నారంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు ఉప ప్రధాని అంటూ కొందరు, ఎన్డీఏ కన్వీనర్ గా పదవి ఇవ్వడంతోపాటు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతున్నా, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరూ ఖండించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ ప్రచారం వెళ్లిందో లేదో కానీ, తెలుగుదేశం సోషల్ మీడియా మాత్రం అంతా ఉట్టి ఉహాగానాలే అంటూ కొట్టిపడేస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలపై జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? అన్న ప్రశ్నల నుంచి నిజంగా చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉందా? అదే జరిగితే నెక్ట్స్ ఆయన ప్లేసులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటూ చర్చ ఉత్కంఠ రేపుతోంది. అయితే అత్యంత సున్నితమైన ఈ అంశంపై కూటమి పార్టీలకు చెందిన ఏ ఒక్కరూ బయటకి మాట్లాడే సాహసం చేయడం లేదు. అత్యంత సీనియర్లు సైతం ఈ ప్రచారం నిజమేనా? అంటూ మీడియా మిత్రులను వాకబు చేస్తుండటం విశేషంగా చెబుతున్నారు.

చంద్రబాబు తలచుకుంటే ఎప్పుడో రాజకీయాల్లోకి వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఆయనకు ఆ అవసరం ఏంటి? అని టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రచారం మొదలుపెట్టిన యూట్యూబ్ చానల్స్ చరిత్రను తవ్వుతున్నారు. బిహార్ నితీశ్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేసిన నేపథ్యంలో విపక్షం వైసీపీ అనుకూల యూట్యూబ్ చానళ్లలో ఈ ప్రచారం ప్రారంభించారని అంటున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా లోకేశ్ కు బాధ్యతలు అప్పగిస్తారని ఊదరగొడుతున్న ప్రచారం అంతా పక్కా రాజకీయ వ్యూహంగా వ్యాఖ్యానిస్తున్నారు.

కూటమిలో గందరగోళం సృష్టించి, టీడీపీ, జనసేన మధ్య ఈ విషయంలో అగాధం తీసుకురావాలనే ఆలోచనతోనే ఒక సెక్షన్ యూట్యూబర్లు ఇటువంటి ప్రచారాన్ని ప్రారంభించారని టీడీపీ అనుకూల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మూడు దశాబ్దాలు క్రితమే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాన్ని కాదనుకున్నారని, ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలను ఆయన గతంలోనే నిర్వహించారని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబుపై జరుగుతున్న ప్రచారం తెలుగు రాజకీయాల్లో హాట్ డిబేట్ గా మారింది.

Tags:    

Similar News