న్యూ ఇయర్ పార్టీలో భారీ పేలుడు.. 40 మంది మృతి
కొత్త సంవత్సర వేడుకలు విషాదం నింపాయి. పాత సంవత్సరాన్ని సాగనంపుతూ.. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ చేసుకునే పండుగ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొని 40 మందికి పైగా మృతి చెందారు.;
కొత్త సంవత్సర వేడుకలు విషాదం నింపాయి. పాత సంవత్సరాన్ని సాగనంపుతూ.. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ చేసుకునే పండుగ లో ఘోర ప్రమాదం చోటుచేసుకొని 40 మందికి పైగా మృతి చెందారు. న్యూ ఇయర్ వేళ స్విట్జర్లాండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకల ఉత్సాహం కొనసాగుతుండగా.. స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మాంటానాలో జరిగిన భారీ పేలుడు.. అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో సుమారు 40 మంది మరణించగా.. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వేలాది మంది పర్యాటకులు విలాసవంతమైన ఆల్పైన్ స్కీ రిసార్ట్‌లకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే క్రాన్స్ మాంటానాలోని 'లే కాన్‌స్టెల్లేషన్' అనే బార్‌లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
క్షణాల్లో వ్యాపించిన మంటలు..
ప్రమాదం జరిగిన సమయంలో బార్ లో 100 మందికి పైగా పర్యాటకులు వేడుకల్లో మునిగిపోయి ఉన్నారు. పేలుడు సంభవించిన నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వారు బయటకు రావడానికి దారి లేక మంటల్లో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఇది అంతర్జాతీయంగా పేరున్న స్కీ రిసార్ట్. ఇక్కడ ఎప్పుడూ పర్యాటకులు అధికంగా ఉంటారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని పోలీసులు తెలిపారు.
సహాయక చర్యలు.. భద్రత
ప్రమాదం జరిగిన వెంటనే స్విస్ పోలీసులు.. అగ్నిమాపక దళం, పలు హెలిక్యాప్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలకు ఆటంకం కలుగకుండా క్రాన్స్ మాంటానా ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించారు. బాధితుల కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హాట్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కారణం ఏమిటి?
ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే న్యూ ఇయర్ కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో వాడిన పైరోటెక్నిక్స్ లాంటి బాణసంచా/నిప్పురవ్వలు కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానిక మీడియా అనుమానిస్తోంది. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.