నీతీశ్ కుమార్.. భారత ఉప ప్రధాని?
వీపీ సింగ్, వాజ్ పేయీల హయాంలోనే నీతీశ్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. పలు శాఖలను సమర్థంగా నిర్వహించారు కూడా.;
తన పాలన ద్వారా బిహార్ లో కొత్త చరిత్ర లిఖించి.. జంగిల్ రాజ్ నుంచి జన్ సురాజ్ తీసుకొచ్చి... సుశాసన్ బాబు (మంచి పాలన అందించే నాయకుడు)గా పేరుతెచ్చుకున్న నీతీశ్ కుమార్ తదుపరి భవిష్యత్ ఏమిటి? 2005 నుంచి మధ్యలో రెండేళ్లలోపు మాత్రమే బిహార్ సీఎంగా లేని ఆయన.. ఇప్పుడు ఏ పదవి చేపడతారు? ఎప్పుడో 25 ఏళ్ల కిందటే నిర్వహించిన రైల్వే శాఖను మళ్లీ తీసుకుంటారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి ఎవరైనా రాష్ట్రస్థాయి నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు. నీతీశ్ మాత్రం జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనకు తెరదించి.. 2005లో తొలిసారిగా సీఎం అయ్యారు. అప్పటినుంచి మధ్యలో కొన్ని నెలలు తప్ప ఆయనే సీఎం. దాదాపు 20 ఏళ్లు సీఎం అనుకోవచ్చు. అంతటి సీనియర్ నేత పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో చేరతారా?
ఏ శాఖ ఇస్తారు..?
వీపీ సింగ్, వాజ్ పేయీల హయాంలోనే నీతీశ్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. పలు శాఖలను సమర్థంగా నిర్వహించారు కూడా. వీటిలో రైల్వే కూడా ఉండడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు మళ్లీ రైల్వే శాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఈ నెల 1తో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నీతీశ్.. గతంలో వ్యవసాయం, ఉపరితల రవాణా, రైల్వే శాఖలను నిర్వర్తించారు. 2000 సంవత్సరం తర్వాత బిహార్ రాజకీయాల్లోకి వెళ్లి సీఎం అయ్యారు. 25 ఏళ్ల తర్వాత అనంతరం మళ్లీ కేంద్రంలోకి వస్తున్నారు.
అద్వానీ తర్వాత ఉప్రప్రధాని?
నీతీశ్ తలపండిన రాజకీయ నేత. లాలూను ధిక్కరించి, జేడీయూ పార్టీని స్థాపించి, ఎన్నిసార్లు కూటములు మార్చినా, గత ఏడాది ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోనే కూటమి విజయం సాధించింది. బీజేపీ కూడా నీతీశ్ ను నమ్మింది. ప్రధాని మోదీ సమ వయస్కుడైన ఆయనకు కేంద్రంలో ఇప్పుడు దక్కే పదవి ఏమిటి? అనే ప్రశ్నకు ఉప ప్రధాని అని సమాధానం వస్తోంది. బీజేపీ వ్యవస్థాపక నాయకుడైన ఎల్ కే అద్వానీ (2002లో) తర్వాత మరే నాయకుడు కూడా ఉప ప్రధాని కాలేదు. ఇప్పుడు నీతీశ్ కు మోదీ ఆ అవకాశం ఇస్తారా?. లేదా, కేవలం రాజ్యసభ సభ్యత్వంతో సరిపెడతారా? అన్నది చూడాలి.