కిలోల చొప్పున మిడతల్ని కొనేస్తున్నారు!

Update: 2020-05-31 06:31 GMT
కోట్లాది మిడతలు రాకాసి దండులా పంట పొలాలమీదకు వచ్చేస్తున్న వైనం పలు దేశాల్ని వణికిస్తోంది. అయితే.. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అన్నట్లు.. ఇలా వచ్చే మిడతల్ని రసాయనాలు పెట్టేసి చంపేయటం ఒక పద్దతి కాగా.. పొరుగున ఉన్న పాకిస్థాన్ లో వినూత్న పద్దతిని అనుసరిస్తున్నారు. మిడతల్నిపట్టుకోండి.. కిలోల లెక్కన తీసుకొస్తే తాము కొంటామని పాక్ లోని పలువురు చెబుతున్నారు.

ఈ మిడతల్ని పొడిచేసి చేపలకు ఆహారం వేస్తే మంచి ప్రోటీన్ లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ మిడతల్ని పట్టుకొని కోళ్లకు ఆహారంగా వేస్తే మంచి లాభమని చెబుతున్నారు. దీంతో.. కోట్లాదిగా వచ్చే మిడతల్ని పట్టేసి.. వాటిని గోతాల్లో కట్టేస్తే.. కిలోల లెక్కన కొనేస్తామని పలువురు బోర్డులు పెడుతున్నారు.కిలో మిడతలు 20 పాక్ రూపాయిల ధర ప్రస్తుతానికి పలుకుతోంది.

దీంతో.. ఎలాంటి శ్రమ లేకుండా మిడతల్ని పెద్ద ఎత్తున పట్టుకొని.. మూటలు కట్టేసి అమ్మేస్తున్నారు. ఇందుకోసం రాత్రివేళ.. టార్గెట్ చేస్తున్నారు. ఉదయమంతా పంటపొలాల మీద దాడి చేసి.. వాటిని ఖాళీ చేసే మిడతలు.. రాత్రిళ్లు నిద్రపోయే వేళలో వాటిని పెద్ద ఎత్తున సేకరిస్తూ.. భారీగా సంపాదిస్తున్నారు. ఒక వ్యక్తి ఈ తీరులో మిడతల్ని అమ్మటం ద్వారా 20వేల పాకిస్థానీ రూపాయిలు సంపాదించాడు. అంటే.. వెయ్యి కేజీల మిడతల్ని పట్టుకున్నట్లుగా చెప్పాలి. దీంతో.. మిడతల్ని భారీగా పట్టేసే కార్యక్రమానికి పాకిస్థానీయులు తెర తీశారు.
Tags:    

Similar News