సంచలనంగా మారిన ట్రంప్ వ్యాఖ్య.. దాడిలా ఉంది

Update: 2020-08-05 07:50 GMT
ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన బీరూట్ పేలుళ్ల విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్య చేశారు. ఎప్పటికప్పుడు తన మాటలతో మంట పుట్టించే ఆయన.. తాజాగా లెబనాన్ రాజధాని నగరంలో చోటు చేసుకున్న పేలుళ్లపై స్పందించారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఈ పేలుళ్ల కారణంగా 70 మంది మరణించగా.. నాలుగు వేలకు పైనే గాయపడినట్లుగా చెబుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

ఇదంతా కూడా పడవలోని పేలుడు పదార్థాల్ని పోర్టు ఏరియాలో నిల్వ చేయగా.. అవి కాస్తా పేలిపోవటంతో ఈ భారీ దుర్ఘటన జరిగినట్లుగా చెబుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యల్ని చేసి అందరూ ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. తాను చాలామందితో మాట్లాడానని.. పలువురు అత్యుత్తమ జనరల్స్ తో మాట్లాడిన తర్వాత అది పేలుడు కాదని.. భారీ బాంబు దాడిగా పేర్కొన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కష్టంలో ఉన్న లెబనాన్ కు ఎలాంటి సాయం చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. లెబనాన్ ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నట్లుగా ట్రంప్ మీద అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉంటే.. లెబనీస్ జనరల్ సెక్యురిటీ చీఫ్అబ్బాస్ ఇబ్రహీం మాత్రం.. తాము సీజ్ చేసిన పడవలోని పేలుడు పదార్థాలను పోర్టులో ఉంచామని.. వాటిలో చోటు చేసుకున్న పేలుడుతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. మొత్తానికి మిస్టరీగా మారిన ఈ పేలుడు వెనుక అసలు నిజం ఏమిటన్నది బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News