13 కోట్ల ఎస్ఆర్‌హెచ్‌ బ్యాట‌ర్ కు షాక్..ప్ర‌పంచక‌ప్ లో నో ప్లేస్

మొన్న‌టి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మినీ వేలంలో రూ.13 కోట్ల రికార్డు ధ‌ర ప‌లికిన విధ్వంసక బ్యాట్స్ మ‌న్, ప‌నికొచ్చే స్పిన్న‌ర్ కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది.;

Update: 2025-12-31 00:30 GMT

మొన్న‌టి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మినీ వేలంలో రూ.13 కోట్ల రికార్డు ధ‌ర ప‌లికిన విధ్వంసక బ్యాట్స్ మ‌న్, ప‌నికొచ్చే స్పిన్న‌ర్ కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది. బంతిని అమాంతం స్టేడియం బ‌య‌ట‌కు కొట్ట‌గ‌ల ఆ బ్యాట‌ర్ ను ప‌క్క‌న‌పెట్టింది. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో వికెట్లు కూడా తీయ‌గ‌ల అత‌డి సేవ‌లను వ‌ద్ద‌నుకుంది. ప్ర‌పంచంలోని ఏ జ‌ట్ట‌యినా స‌రే కోరుకునే అత‌డిని ఇంగ్లండ్ బోర్డు మాత్రం విస్మ‌రించింది. కేవ‌లం ఫామ్ లో లేడ‌ని అనుకుంటే ఈ సూత్రం మిగ‌తా ఆట‌గాళ్ల‌కు కూడా వ‌ర్తించాలి. కానీ, అత‌డికంటే మెరుగ్గా ఆడ‌గ‌ల‌ర‌ని భావించి అత‌డిని ప్రాథమిక జ‌ట్టుకు ఎంపిక చేయ‌కుండా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి-మార్చి నెల‌ల్లో భార‌త్ తో పాటు శ్రీలంక టి20 ప్ర‌పంచ క‌ప్ న‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. టీమ్ ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ గా దిగుతున్నది. ఈ మెగా టోర్నీకి ప్ర‌క‌టించిన ప్రాథ‌మిక జ‌ట్టులో భార‌త టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ కు చోటు ద‌క్క‌లేదు. టి20ల‌లోనూ అత‌డిని కెప్టెన్ ను చేసే ఉద్దేశంలో వైస్ కెప్టెన్ గా నియ‌మించాగా ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికా సిరీస్ లో గిల్ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో గాయం సాకుతో చివ‌రి రెండు టి20ల‌కు త‌ప్పుకొన్నాడు. త‌ర్వాత టి20 ప్రపంచ‌ క‌ప్ జ‌ట్టులోనే చోటు కోల్పోయాడు. ఇప్పుడు ఇలాంటి పెద్ద‌ నిర్ణ‌యమే మ‌రో దేశ క్రికెట్ బోర్డు కూడా తీసుకుంది.

మొద‌ట వ‌ద్ద‌ని.. త‌ర్వాత రికార్డు ధ‌ర‌కు..

ఇంగ్లండ్ హార్డ్ హిట్ట‌ర్ లియామ్ లివింగ్ స్ట‌న్ గురించి భార‌త క్రికెట్ అభిమానుల‌కు ప‌రిచ‌య‌మే. అత‌డు కొట్టే షాట్ల‌కు బంతి స్టేడియం బ‌య‌ట‌కు కూడా ప‌డుతుంది. కావాల్సిన స‌మ‌యంలో స్పిన్ కూడా వేస్తాడు. అయితే, లివింగ్ స్ట‌న్ ను ఇంగ్లండ్ 15 మంది స‌భ్యుల టి20 ప్ర‌పంచ క‌ప్ ప్రాబ‌బుల్స్ కు ఎంపిక చేయ‌లేదు. ఇటీవ‌లి వేలంలో అత‌డిని రూ.13 కోట్లు పెట్టి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద‌క్కించుకుంది. మినీ వేలంలో మొదట లివింగ్ స్ట‌న్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో రాగా ఎవ‌రూ తీసుకోలేదు. మ‌రో రౌండ్ వేలంలో ఏకంగా రూ.13 కోట్ల ప‌లికాడు. 2025 సీజ‌న్ లో ఇత‌డు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు రూ.2 కోట్ల‌తో మెగా వేలంలోకి రాగా రూ.8.75 కోట్లు పెట్టింది బెంగ‌ళూరు. ఇప్పుడు అంత‌కుమించిన ధ‌ర పెట్టించి స‌న్ రైజ‌ర్స్. కానీ, సొంత దేశం టి20 జ‌ట్టులో మాత్రం లివింగ్ స్ట‌న్ కు చోటే లేకుండా పోయింది.

ఆ పేస‌ర్ కు చోటు..

ఇంగ్లండ్ జ‌ట్టులో కీల‌క‌మైన పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ కు చోటు ద‌క్కింది. ప్ర‌స్తుత యాషెస్ సిరీస్ నుంచి ఆర్చ‌ర్ గాయం కార‌ణంగా త‌ప్పుకొన్నాడు. వాస్త‌వానికి అత‌డు కెప్టెన్ స్టోక్స్ తో వాద‌న‌కు దిగ‌డంతో నాలుగో టెస్టుకు ప‌క్క‌న‌పెట్టారు. కాగా, ఇంగ్లండ్ ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టుకు బ్యాట్స్ మ‌న్ హ్యారీ బ్రూక్ కెప్టెన్. విధ్వంస‌క వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోష్ బ‌ట్ల‌ర్ తో పాటు ఐపీఎల్ ద్వారా భార‌తీయులకు ప‌రిచ‌యం ఉన్న ఫిల్ సాల్ట్, సామ్ క‌ర‌న్, జాక‌బ్ బెతెల్ ల‌కు చోటు ద‌క్కింది. యాషెస్ సిరీస్ లో బాక్సింగ్ డే టెస్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించిన జోష్ టంగ్ ను కూడా టి20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టుకు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ ఉన్న గ్రూప్ లో వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇట‌లీ జ‌ట్లు ఉన్నాయి.

Tags:    

Similar News