వెండి మెరుపులు తాత్కాలికమేనా.. చరిత్ర చెబుతోన్న చేదు నిజం ఇదిగో..!

అవును... ఈ ఏడాది వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-30 18:30 GMT

ఇటీవల ఎన్నడూ లేని స్థాయిలో అన్నట్లుగా వెండి మెరుపులు మెరిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వెండి ధరలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేవలం నెల రోజుల్లోనే వెండి ధరలు సుమారు రూ.80 వేలు పెరిగి.. కిలో వెండి ధర రూ.2.50 లక్షలకు చేరిన పరిస్థితి. దీనికి గల కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఈ మెరుపులు శాశ్వతం కాదని.. ఇవి తాత్కాలికమేనంటూ చరిత్ర చెబుతోన్న చేదు నిజాలు గుర్తు చేస్తున్నాయి.

అవును... ఈ ఏడాది వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క ఏడాది కాలంలోనే ఇప్పటివరకూ వెండి 181 శాతం మేర పెరిగిందంటే.. దాని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అందుకు పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. భౌగోళిక అనిశ్చితుల కారణంగానే ఇటీవల వెండికి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో.. గిరాకీకి తగినట్లుగా వెండి సరఫరా లేదని.. అందువల్ల ధరలు పెరుగుతాయనే అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువమంది వెండిపై పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు. మరోవైపు ఈ ఏడాదికి ఇప్పటికే బంగారం ధర సుమారు 70 శాతానికి పైగా ఎగబాకిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 1979 తర్వాత ఇదే అతిపెద్ద వార్షిక లాభమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనూ ధరలు పరుగులు పెట్టోచ్చని అంటున్నారు.

అయితే.. వెండి ధరల విషయంలో ఇప్పటి వరకూ చెప్పుకున్న సందడి కాస్తా తాజాగా తగ్గుముఖం పట్టడం మొదలైంది! తాజాగా వెండి దూకుడుకు బ్రేక్ పడింది. వెండి కిలో ధర ఇటీవల రూ.2,54,174 వద్ద గరిష్టాన్ని తాకగా.. సోమవారం తర్వాత రూ.2,33,120 వద్ద కనిష్టాన్ని తాకిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ధర హైదరాబాద్ వంటి నగరంలో రూ.2,31,400 కు పడిపోయింది. అయితే... వెండి విషయంలో ఈ భారీ మార్పులు సహజమే అని చరిత్ర చెబుతోంది.

గతంలో కూడా చాలా సార్లు వెండి ధరలు స్వల్ప వ్యవధిలోనే భారీగా పెరిగి, ఆ తర్వాత అంతకు మించిన వేగంతో భారీగా పతనమైన సందర్భాలు ఉన్నాయి. ఇందులో భాగంగా.. 1980లో ఔన్స్‌ వెండి ధర $50 నుంచి $5కి అంటే.. 90% పడిపోగా.. 2011లో $48 నుంచి $12కి అంటే.. 75% పడిపోయింది. ఇదే క్రమంలో.. 2020లో $30 ఉన్న ఔన్స్ వెండి ధర సుమారు 40% పడిపోయి $18కి చేరింది.

అయితే తాజాగా ఒక్క రోజులోనే సుమారు రూ.21 వేలకు పైగా వెండి ధర పడిపోవడానికి రష్యా – ఉక్రెయిన్ వార్ పై ట్రంప్ వ్యాఖ్యలు కూడా కారణమని అంటున్నారు. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భేటీ అవ్వడం.. శాంతి ఒప్పందం విషయంలో పుతిన్, జెలెన్‌ స్కీ ఇద్దరూ పూర్తి సుముఖంగా ఉన్నట్లు ట్రంప్‌ ప్రకటించడం.. యుద్ధానికి తెరపడుతుందన్న అంచనాల వేళ వెండి ధర పతనం అయ్యిందని చెబుతున్నారు.

Tags:    

Similar News