పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటి ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏణ్ణర్థం దాటేసింది. జనవరి వస్తే 19 నెలలు అవుతుంది.;

Update: 2025-12-30 17:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏణ్ణర్థం దాటేసింది. జనవరి వస్తే 19 నెలలు అవుతుంది. ప్రజలు ఇచ్చిన అయిదేళ్ళ అధికారంలో మూడవ వంతు మరి కొద్ది రోజులలో కరిగిపోతుంది. టీడీపీ కూటమి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఒక ఎత్తు అయితే మిత్రులుగా జనసేన బీజేపీ రాజకీయ ప్రదర్శన ఎలా ఉంది అన్నది మరో ప్రశ్న. టీడీపీ కూటమికి పెద్దన్నగా అతిపెద్ద పార్టీగా టీడీపీ తన వంతు పాత్రను అత్యంత ప్రభావవంతంగా పోషిస్తోంది. చంద్రబాబు కూటమి నాయకుడు కాబట్టి టీడీపీ మాట నూరు శాతం చెల్లుతోంది. అంతే కాదు పేరుకు కూటమి ప్రభుత్వం కానీ జరిగేదంతా టీడీపీ వ్యవహారమే అని అంతా చెప్పుకునే నేపథ్యం ఉంది. మరి పవర్ స్టార్ గా జనసేనాధిపతిగా పవర్ ఫుల్ రోల్ పోషిస్తారు అని అంతా అనుకుని 2024 ఎన్నికల ముందు ఒక రేంజిలో పవన్ ని చూసిన వారంతా ఈ గడచిన కాలంలో జనసేన ఎక్కడ దాని పెర్ఫార్మెన్స్ ఎక్కడా అసలు ప్రభుత్వంలో పవన్ పాత్ర ఏమిటి ఎంత అన్నది గట్టిగానే చర్చించుకుంటున్నారు.

కీలకమైన హోదాలో :

చూడబోతే కూటమి ప్రభుత్వంలో పవన్ స్థానం నంబర్ టూ అనే అనాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తరువాత అంతటి పదవి ఉప ముఖ్యమంత్రి. ఆ హోదాలో ఆయన ఉన్నారు. పైగా అయిదారు కీలకమైన శాఖలు చేతిలో ఉన్నాయి. మరి ఇంత అజమాయిషీ చేసే వీలు ఉన్నా పవన్ మాట ఏ మేరకు ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతోంది అన్నదే పెద్ద చర్చగా ఉంది. కూటమి ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిన పవన్ కి ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత దక్కింది. ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా సీఎం తరువాత పవన్ ఫోటో ఉంటోంది. ఆయనకు సీఎం స్థాయిలోనే ప్రోటోకాల్ కూడా ఉంటోంది. అంతా బాగానే ఉంది, అధికార ఆర్భాటానికి అయితే లోటు లేదు కానీ విధానపరమైన నిర్ణయాలలో పవన్ రోల్ ఎంత. ఆయన ప్రయత్నం ఎంత ఆయన మాట నెగ్గించుకునే తీరు ఎంత అన్నదే కీలకమైన మౌలికమైన ప్రశ్నలుగా ఉన్నాయని అంటున్నారు.

ప్రభావం కనిపిస్తోందా :

కూటమి ప్రభుత్వంలో పవన్ ప్రభావం కనిపిస్తోందా అంటే జవాబు అయితే చేదుగానే వస్తోంది. పవన్ ఒక మాట అంటే జరగడం లేదని అంటున్నారు సీజ్ ద షిప్ అంటే ఆ షిప్ ఏమైందో ఎవరికీ తెలియదు, రేషన్ బియ్యం అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది అని వైసీపీ నేతలే విమర్శిస్తున్నారు. ఇక భీమవరంలో జూదాలు పేకాట మీద విచారణ చేసి నివేదిక కావాలని ఆయన కోరారని వార్తలు వచ్చాయి. దాని సంగతి ఏమైందో తెలియదు ఏపీలో కీలక శాఖలలో పనితీరు బాగులేదని పవన్ ప్రత్యక్షంగా పరోక్షంగా గతంలో కొన్ని సార్లు బాహాటం అయ్యారు కానీ ఆ తర్వాత వాటి మీద ఫోకస్ ఎంతవరకూ ఉంది, మ్యాటర్ కి లాజికల్ ఎండ్ కార్డు పడిందా అంటే జవాబు లేదు అనే వస్తోంది. ఇక ప్రభుత్వం సమిష్టిగా నడుస్తోంది. టీడీపీ నిర్ణయాలు చెల్లుబాటు అవుతున్నాయి పవన్ మార్క్ ఆలోచనలు ఏమైనా ఇప్పటిదాకా అమలులోకి వచ్చాయా అంటే జవాబు శూన్యమే అంటున్నారు. ప్రతీ యువకుడికీ పది లక్షల రూపాయలు పెట్టుబడి సొమ్ముగా ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా చేస్తామని జనసేన హామీ ఎన్నికల్లో ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు అని చెప్పారు, ఇలా చూస్తే ఎన్నో హామీలు ఉన్నాయి, మరి జనసేన మార్క్ ఇది ఒక్కటి జరిగింది అని చెప్పుకునే వీలుందా అంటే కూడా సమాధానం లేదని అన్న మాట అయితే ఉందిట.

మంత్రులతో భేటీ :

పవన్ శాఖల సంగతి పక్కన పెడితే తన పార్టీకి చెందిన మంత్రులతో ఆయన భేటీలు వేసి వారి పనితీరుని మధింపు చేస్తున్నది ఏదైనా ఉందా అంటే అది కూడా పెద్దగా లేదని అంటున్నారు. ఎమ్మెల్యేలు మరో 18 మంది దాకా గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు, వారితో టచ్ లో ఎప్పటికప్పుడు పవన్ ఉంటున్నారా అంటే లేదని ప్రచారం అయితే సాగుతోంది. ఇలా అన్నీ చూస్తూ ఉంటే అసలు కూటమి ప్రభుత్వంలో పవన్ పాత్ర ఏమిటి జనసేన పార్టీని అధికారంలో ఉండగా పటిష్టం చేసుకునే విషయంలో తీసుకునే నిర్ణయాలు ఏమిటి అన్నది అంతా ఒక పెద్ద డిస్కషన్ గానే ఉందిట. మరి పవన్ మార్క్ కనిపించని కూటమి ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగడం వరకూ బాగానే ఉంది కానీ రాజకీయంగా కానీ ప్రజల పరంగా కానీ ప్రయోజనం అయితే ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి 2026 నుంచి అయినా పవన్ మార్క్ కనిపిస్తుందేమో.

Tags:    

Similar News