హరీష్ రావు తెలంగాణ చంద్రబాబు.. బీఆర్‌ఎస్‌లో ‘కవిత’ బాంబ్..

బీఆర్ఎస్ లోని అంతర్గత విషయాలను బయటపెడుతూ కవిత రాజేస్తున్న మాటల మంటలు కేటీఆర్, హరీష్ రావు లకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి;

Update: 2025-12-30 19:15 GMT

కల్వకుంట్ల కవిత రోజుకో బాంబు పేల్చుతూ బీఆర్ఎస్ ను ఆగమాగం చేస్తోంది. బీఆర్ఎస్ లోని అంతర్గత విషయాలను బయటపెడుతూ కవిత రాజేస్తున్న మాటల మంటలు కేటీఆర్, హరీష్ రావు లకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. న్యూ ఇయర్ వచ్చేవేళ ఈ ఇయర్ ఎండింగ్లో కవిత మరోసారి మీడియా ముందుకు వచ్చి ఈసారి హరీష్ రావును బీఆర్ఎస్ రాజకీయాలను ఎండగట్టారు. తాజాగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి తెలంగాణ చంద్రబాబు గా అభివర్ణిస్తూ ఆమె చేసిన విమర్శలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి .

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత 2025 ఏడాది ముగింపు వేళ సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో పెను ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.

హరీష్ రావు ఎప్పటికైనా తెలంగాణలో చంద్రబాబు తరహా రాజకీయాలు చేస్తారని.. పార్టీని కబ్జా చేసే అవకాశం ఉందనే అనుమానం కార్యకర్తల్లో ఉందని కవిత బాంబు పేల్చారు. హరీష్ రావు పార్టీకి ద్రోహం చేస్తారని కేడర్ భావిస్తుందని ఆమె ఆరోపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన ఓటమి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని.. ఆ సమయంలో జరిగిన అవమానాలను మర్చిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అరెస్టులు, కేసులతో ఇబ్బంది పడుతున్నప్పుడు పార్టీలోని ముఖ్య నేతలు ఎలా ప్రవర్తించాలో తనకు గుర్తుందని పరోక్షంగా చురకలు అంటించారు.

కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు

తన సోదరుడు కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా కవిత ఘాటుగా స్పందించారు. కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరారని.. కానీ తాను మాత్రం 2006 లోనే తెలంగాణ జాగృతి స్థాపించి క్షేత్రస్థాయిలో పోరాడాలని గుర్తు చేశారు. తన ఫోన్ తో పాటు తన భర్త చివరకు ఇంట్లో పని చేసే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కవిత సంచలన ఆరోపణ చేశారు. ఒకవేళ కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ ఐతే ఆయన ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ లో మహిళలకు అన్యాయం

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా నేతలకు సరైన గుర్తింపు లభించలేదని కవిత అసహనం వ్యక్తం చేశారు. గతంలో 42 కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడానికి తాను అప్పుడే కేసీఆర్ ను నిలదీశానని ఆమె వెళ్లడించారు. ఉద్యమ సమయంలో నరకం అనుభవించిన మహిళా కార్యకర్తలకు నేడు గుర్తింపు లేదని ఆవేదన చెందారు.

2025 ముగింపు వేళ కవిత ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ బీఆర్‌ఎస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా చీలికలను స్పష్టం చేస్తోంది. వచ్చే ఏడాది ఆమె పార్టీపై మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News