మన శరీరం.. ఒక అద్భుత విద్యుత్ వ్యవస్థ.. ఆలోచన నుంచి అడుగు వరకు అన్నీ సంకేతాలే!

జీవం పుట్టుక అనేది ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కూడా ప్రామాణికంగా తేల్చని విషయం.. మన బాడీ ఎలా నిర్మించబడింది.. దాన్ని ఎలా సరిదిద్దుకుంటుంది…;

Update: 2025-12-31 01:30 GMT

జీవం పుట్టుక అనేది ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కూడా ప్రామాణికంగా తేల్చని విషయం.. మన బాడీ ఎలా నిర్మించబడింది.. దాన్ని ఎలా సరిదిద్దుకుంటుంది… మనం ఎలా కదులుతాం ఆలోచిస్తాం.. అనేదానిపై ఇప్పటికీ కూడా ఎన్నో సందేహాలు శాస్త్రవేత్తలు, వైద్యులకు లొంగని ఎన్నో విషయాలను మనం చూస్తూనే ఉన్నాం. మానవ శరీరం అంటే కేవలం రక్తం, మాంసం, ఎముకల కలయిక మాత్రమే కాదు.. అదొక అత్యంత సంక్లిష్టమైన అద్భుతమైన జీవ విద్యుత్ వ్యవస్థ. మనం కళ్ళు రెప్పవేసిన గుండె కొట్టుకున్న చివరికి ఒక చిన్న ఆలోచన చేసిన దాని వెనుక ఒక విద్యుత్ ప్రవాహం దాగి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు.

మెదడు.. ఒక సూపర్ పవర్ స్టేషన్..

మన శరీరంలో ఒక సూపర్ పవర్ స్టేషన్గా మెదడు ఉంది. మన శరీరంలోని నరాల వ్యవస్థ ఒక హై స్పీడ్ నెట్వర్క్ లా పనిచేస్తుంది. మెదడులోని న్యూరాన్లు విద్యుత్ తీగల వ్యవహరిస్తూ సమాచారాన్ని సెకండ్ కు వందల కిలోమీటర్ల వేగంతో చేరవేస్తాయి. ఉదాహరణకు మీరు ఒక వస్తువును పట్టుకోవాలని అనుకోగానే మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు నరాల ద్వారా ప్రవహించి కండరాలను కదిలిస్తాయి. ఈ ప్రక్రియ కనురెప్ప పాటు కాలం కంటే వేగంగా జరుగుతుంది.

గుండె లయ వెనుక విద్యుత్ తరంగాలు…

గుండె నిరంతరం కొట్టుకోవడానికి కారణం అందులో ఉండే ప్రత్యేకమైన కణాలు. ఇవి ఒక పేస్ మేకర్ లా పనిచేస్తూ క్రమ పద్ధతిలో విద్యుత్ పల్స్ లను విడుదల చేస్తాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్లే గుండె కండరాలు కుచించుకుపోయి రక్తాన్ని శరీరం అంతట పంపిణీ చేస్తాయి. ఈ విద్యుత్ వ్యవస్థలో స్వల్ప మార్పులు వచ్చిన గుండె లయ తగ్గుతుంది.

నడిస్తే చాలు.. విద్యుత్ పుడుతుంది..

మీరు నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు మీ ఎముకల్లో స్వల్పంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మీకు తెలుసా... కానీ ఇది నిజంగా నిజం. దీనినే పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఎముకలపై ఒత్తిడి పడినప్పుడు కలిగే ఈ విద్యుత్ ప్రేరణలే ఎముకలు బలంగా పెరగడానికి విరిగినప్పుడు తిరిగి అతుక్కోవడానికి సహాయపడతాయని పరిశోధకులు ఇటీవల తెలిపారు.

ఆలోచనతో కదిలే కృత్రిమ అవయవాలు

ఈ జీవ విద్యుత్ రహస్యాలను ఛేదించడం వల్ల వైద్యరంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. ప్రమాదాల్లో చేతులు కాళ్లు కోల్పోయిన వారికి బయోనిక్ అవయవాలు వరంలా మారుతున్నాయి. మెదడు ఇచ్చే విద్యుత్ సంకేతాలను గ్రహించి కేవలం ఆలోచనతోనే పనిచేసే కృత్రిమ చేతులు కాళ్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో పక్షపాతం ఉన్నవారు కూడా తమ ఆలోచనల ద్వారా కంప్యూటర్లను యంత్రాలను నియంత్రించే రోజులు ఎంతో దూరంలో లేవు.

ప్రకృతి సృష్టించిన అత్యంత క్లిష్టమైన 'సర్క్యూట్' మన శరీరం. బాహ్య బ్యాటరీలు అవసరం లేకుండా, మనం తినే ఆహారం నుంచే శక్తిని పొందుతూ నిరంతరం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే ఈ వ్యవస్థ ఒక అద్భుతం. విజ్ఞాన శాస్త్రం ఎంత ఎదిగినా మానవ శరీర నిర్మాణంలోని రహస్యాలు నిరంతరం మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.

Tags:    

Similar News