అప్పట్లో42.. ఆ తర్వాత 45.2.. ఈసారి ఎంత?

Update: 2020-11-18 05:45 GMT
గ్రేటర్ హైదరాబాద్ మహానగర సంస్థకు నిర్వహిస్తున్న ఎన్నికల నగరా మోగింది.  ఒకప్పుడు హైదరాబాద్ లో టీఆర్ఎస్ పట్టు అంటే.. నేతల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆ మాటకు వస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీనే చేయలేదు. ఇదే విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు తరచూ ప్రస్తావించేవి. కానీ.. టీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉండేది. కారణం.. గ్రేటర్ లో గులాబీ పార్టీ బలహీనంగా ఉండటమే.

2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవటానికి కారణం.. పోటీ చేస్తే దక్కే డివిజన్ల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలిగించేలా చేయటం.. పార్టీకి పట్టు లేకపోవటం.. ఉద్యమానికి పట్టు లేనట్లుగా ప్రచారం సాగటమేనని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో 42 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లకు అంటే.. 2016లో గ్రేటర్ ఎన్నికల్నినిర్వహించారు. అధికార పార్టీ అన్న ట్యాగ్ తో తొలిసారి జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్..భయం భయంగానే దిగింది. ఎవరూఅంచనా వేయలేని రీతిలో ఆ పార్టీ ఏకంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. గ్రేటర్ చరిత్రలో ఇంత భారీగా డివిజన్లను కైవశం చేసుకున్న మొదటిపార్టీ టీఆర్ఎస్ అని చెప్పక తప్పదు. ఈ రికార్డును ఇప్పట్లో ఎవరూ చెరపలేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. తాజాగా జరిగే ఎన్నికల్లో తామీ రికార్డును బ్రేక్ చేస్తామని.. 104 స్థానాల్లో గెలుస్తామని మంత్రులు కేటీఆర్..తలసాని లాంటి వారు చెప్పినా.. మాటలు చెప్పినంత ఈజీ కాదన్న మాట వినిపిస్తోంది. 2016లో జరిగిన ఎన్నికల్లో 45.29 శాతం మంది ఓటర్లు తమ ఓట్లు వేశారు. గ్రేటర్ లో ఎప్పుడు తక్కువగానే పోలింగ్ నమోదు కావటం కనిపిస్తూ ఉంటుంది.

ఈసారి అందుకు భిన్నంగా.. పోలింగ్ పెరిగే వీలుందని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో బీజేపీ మాంచి  జోష్ లోకి రావటంతో ఎన్నికల వేళ కొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. గెలుపుఅవకాశాలు తక్కువగా ఉన్నా.. సాధించే సీట్ల ఆధారంగా తెలంగాణ అధికారపక్షం మీద ఒత్తిడిని పెంచే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల వేళ ఉన్న ఏ చిన్న అవకావాన్ని మిస్ కాకూడదన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే.. ఈసారి పోలింగ్ పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News