షాకింగ్ రిపోర్టు.. తక్కువగా మందేసినా క్యాన్సర్ ముప్పు?

తాజాగా వెలుగు చూసిన అధ్యయనం అవాక్కు అయ్యేలా చేయటమేకాదు.. షాకిచ్చేలా మారింది.;

Update: 2025-12-25 14:30 GMT

తాజాగా వెలుగు చూసిన అధ్యయనం అవాక్కు అయ్యేలా చేయటమేకాదు.. షాకిచ్చేలా మారింది. మద్యం ప్రియుల్ని పక్కన పెడదాం. అప్పుడప్పుడు సరదాగా మందేసే వాళ్లు సైతం ఉలిక్కిపడే అంశం వెలుగు చూసింది. మద్యాన్ని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని.. అతిగా తాగే వారికి తప్పించి.. లెక్కగా తాగే వారికి ఎలాంటి ఇష్యూ ఉండదనే మాటలన్ని అపోహలే అన్న విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

జాతీయ.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల టీం తాజాగా నిర్వహించిన అధ్యయనంలో రోజుకు 9 గ్రాముల మద్యం తీసుకున్నా.. నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం యాభై శాతం ఎక్కువనీ.. నాటుసారా తాగితే ఆ ముప్పు 87 శాతానికి పెరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. దాదాపు పన్నెండేళ్ల వ్యవధిలో పలువురిని పరీక్షించిన తర్వాత ఈ రిపోర్టును సిద్ధం చేశారు. 2010 నుంచి 2021 మధ్య కాలంలో 1803 నోటి క్యాన్సర్ పీడితులు.. 1903 మంది ఆరోగ్యవంతుల్ని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా తీసుకున్నారు. వీరిని పరిశీలించిన వారు.. నోటి క్యాన్సర్ బాధితుల్లో 62 శాతం మద్యం తాగటంతో పాటు.. గుట్కా నమిలిన కేసులే అన్న విషయాన్ని గుర్తించారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లిక్కర్ బ్రాండ్ల మద్యాన్ని తీసుకున్నప్పటికి నోటి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు. నాటుసారాలో మెథనాల్.. ఎసిటాల్ డిహైడ్ లాంటి విష పదార్తాలు ఉండటంతో ప్రమాదం మరింత ఎక్కువని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పది క్యాన్సర్ కేసుల్లో ఒకటి నోటి క్యాన్సర్ కేసు కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో మితంగా మద్యం పుచ్చుకున్నా.. క్యాన్సర్ భూతం పట్టేసే ప్రమాదం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News