తెలుగు మ‌హాస‌భ‌ల రేంజ్ ఏంటో తెలుసా..

Update: 2017-12-09 23:30 GMT
ప్రపంచ తెలుగు మహాసభల వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం స‌న్నాహాలు చేస్తోంది. రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాలు జరుగుతాయి. మూడ్రోజులు 2 గంటల పాటు సాహిత్య సదస్సులు నిర్వహిస్తుండ‌గా... రెండున్నర గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. కాగా, ప్రారంభ వేడుక‌ల‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు సభకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం....ప్ర‌పంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాల నుంచి 500 మంది హాజరవుతారు. ఇతర రాష్ర్టాల నుంచి 1500 మంది హాజరవుతారు. స్థానికంగా 6 వేల మంది దాకా హాజరవుతున్నారు. ఎల్బీ స్టేడియం లోపల 8 ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది ద్వారాలకు 8 మంది సుప్రసిద్ధ కవుల పేర్లు పెడుతున్నారు. స్టేడియం లోపల పురావస్తు ప్రదర్శన శాల, పుస్తకాల ప్రదర్శన తదితర 8 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం బయట తెలంగాణ వంటలకు సంబంధించి 50 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా....తెలుగు మ‌హాస‌భ‌ల విష‌యంలో విప్లవ రచయితల సంఘం సీఎం కేసీఆర్ తీరుపై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. విర‌సం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేద్రంలో సమావేశంలో ర‌చ‌యిత వరవరరావు మాట్లాడుతూ ఈ స‌భ‌ల తీరును ఎద్దేవా చేశారు. 1974 వెంగళరావు ప్రభుత్వంలో శ్రీ శ్రీ తెలుగు మహాసభలను అడ్డుకుని 36 గంటలపాటు బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఉన్నార‌ని వ‌ర‌వ‌ర‌రావు గుర్తు చేశారు. కే చంద్రశేఖరరావు ప్రభుత్వం కూడావెంగళరావు ప్రభుత్వానికి ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్, నందినిసిద్ధారెడ్డి లు రెండు తెలుగులు ఒకటి కాదన్నారని...అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయములో తెలుగు మహాసభలను పెడితే బహిష్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు వారిద్ద‌రే హ‌డావుడి చేస్తున్నార‌ని వ‌ర‌వ‌ర‌రావు వ్యాఖ్యానించారు.

ప్ర‌భుత్వం తీరును నిర‌సిస్తూ...తెలుగు మహాసభలను అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. కష్టజీవికి ఇరువైపుల ఉండే వాళ్లే కవులని చాటుతామ‌న్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తామ‌ని తెలిపారు. ఇటీవ‌ల జరిగిన జీఈఎస్ సదస్సు  ప్రజలను - శ్రమశక్తి - పేదలను దోచుకోవడానికి ఎలా అయితే జరిగాయో ఇప్పుడు ప్రపంచ తెలుగు మహా సభలు అలాగే జరుగుతున్నవని వ‌ర‌వ‌ర‌రావు ఆరోపించారు.ఇవి  దోపిడి వర్గాల మహాసభలు తప్ప తెలుగు మహాసభలు కావని ఆయ‌న మండిప‌డ్డారు.
Tags:    

Similar News