అమిత్ షాకు టీడీపీ ఎంపీ ఫిర్యాదు.. విష‌యం ఇదే!

Update: 2021-02-03 16:41 GMT
ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. బుధ‌వారం హోం మంత్రితో సుమారు 25 నిముసాల‌పాటు భేటీ  అయిన‌.. గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల రవీంద్ర‌కుమార్‌లు.. ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. దాదాపు 16 అంశాల‌తో కూడిన ఫిర్యాదుల చిట్టాను హోం మంత్రి షాకు ఇచ్చారు. అనంత‌రం.. వారు మీడియాతోనూ మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా  రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను  హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన‌ట్టు ఎంపీ క‌న‌క మేడ‌ల మీడియాకు చెప్పారు. ఆయ‌న మాట్లాడుతూ.. రాజ‌ధాని రైతుల‌ను అణిచి వేస్తున్న విష‌యాన్ని షాకు వివ‌రించిన‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ దాడులు చేస్తూ.. ఏక‌గ్రీవాలు చేయించుకునేందుకు బెదిరింపుల‌కు దిగుతున్న వైఖ‌రిని కూడా వివ‌రించామ‌న్నారు. ఇక‌, కొన్నాళ్లుగా దేవాలయాలపై జ‌రుగుతున్న దాడులు, శాంతి భద్రతల  విఘాతం వంటి వాటిని కూడా వివ‌రించిన‌ట్టు తెలిపారు.

ఇక‌, మ‌రీ ముఖ్యంగా ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై వైసీపీ మంత్రులు, ప్ర‌భుత్వం క‌క్ష కట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోందంటూ.. ప్ర‌ధానంగా ఈ అంశంపైనా ఫిర్యాదు చేసిన‌ట్టు గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పేర్కొన్నారు. ఇక‌, రాష్ట్రంలో కొన్ని ఛానెళ్ల‌పై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంద‌న్న విష‌యాన్ని కూడా వీరు.. షాకు ఇచ్చిన ఫిర్యాదుల చిట్టాలో ప్ర‌ధానంగా పేర్కొన్న‌ట్టు చెప్పారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్న ఛానెళ్ల‌ను మాత్రమే జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూలంగా చూస్తోంద‌ని, మిగిలిన వాటిని తొక్కేస్తోంద‌ని.. ఎంపీ క‌న‌క మేడ‌ల మీడియాతో నూ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డ విషయాన్ని షా దృష్టికి ఎంపీలు తెచ్చారు. అదేస‌మ‌యంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు   కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ విష‌యాన్ని కూడా షాకు వివ‌రించి.. జ‌గ‌న్ స‌ర్కారుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నికోరిన‌ట్టు ఎంపీలు గ‌ల్లా, క‌న‌క‌మేడ‌ల వివ‌రించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News