ఎన్టీఆర్ చేసిన మంత్రి ఇక లేరు

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అయిన గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందారు.;

Update: 2026-01-13 03:53 GMT

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అయిన గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. ఆయన తన ఇంట్లో కాలు జారి పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయం తగిలింది. దాంతో రెండు రోజుల క్రితం ఆయనను జిల్లాలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.

ఎన్టీఆర్ మంత్రివర్గంలో :

దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయ జీవితాన్ని కొనసాగించిన గుండ అప్పల సూర్యనారాయణ 1981లో శ్రీకాకుళం మునిసిపాలిటీ కౌన్సిలర్ గా తన ప్రజా జీవితాన్ని మొదలెట్టారు. అనంతరం ఆయన 1983లో టీడీపీలో చేరారు. మొదటి ఎన్నికలలో తంగి సత్యనారాయణకు శ్రీకాకుళం టికెట్ దక్కింది. అయితే ఆయన 1984 ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కరరావు వైపు వెళ్ళిపోవడంతో 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్ గుండా అప్పల సూర్యనారాయణకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. ఆయన మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఎన్టీఆర్ ఆయన పనితీరు నిబద్ధతను మెచ్చి మంత్రిగా కీలక శాఖలను అప్పగించారు.

వరస విజయాలు :

ఇక 1985 నుంచి 1999 వరకూ నాలుగు సార్లు గెలిచారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఆయన శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసించారు. అప్పట్లో ఆయన టీడీపీ రాజకీయాల్లో ఎంతో మందిని తీర్చిదిద్దారు. ఇక 2004, 2009లలో కాంగ్రెస్ శ్రీకాకుళంలో గెలిచింది. దాంతో ఆయన వెనకబడ్డారు. 2014 ఎన్నికల్లో ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి గెలిచారు. 2024లో మాత్రం ఆ కుటుంబానికి టికెట్ దక్కలేదు. ఇదిలా ఉంటే రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లుగా అప్పల సూర్యనారాయణ 2024లోనే ప్రకటించారు.

అజాత శత్రువుగా :

ఇక ఆయన జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉన్నారు. అన్ని పార్టీలతో సన్నిహితంగా మెలిగారు. అప్పల సూర్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ టీడీపీకి జిల్లాలో చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ, పార్టీ పట్ల అంకితభావంతో ఆయన చేసిన సేవలు మరువలేనివని చంద్రబాబు నివాళి అర్పించారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని అని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

నిజాయితీకి మారు పేరు :

ఇక ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తన సంతాప సందేశంలో గుండ అప్పల సూర్యనారాయణ చేసిన సేవలను తలచుకున్నారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచిన గుండ అప్పల సూర్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటుగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అని లోకేష్ అన్నారు. ముక్కుసూటి నిజాయితీకి మారుపేరైన ఆయన రాజకీయ జీవితం ఎంతో మంది నాయకులకు స్ఫూర్తి అని అన్నారు. ఇదిలా ఉంటే పండుగ ముందున శ్రీకాకుళం జిల్లా టీడీపీకి అతి పెద్ద విషాదంగా మాజీ మంత్రి మరణం ఉందని అంటున్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది అని క్యాడర్ అంటోంది.

Tags:    

Similar News