గ్యాంగ్‌ స్టర్‌ అబూ సలెంకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ఇదే!

257 మంది అమాయకుల ప్రాణాలు తీసి, దాదాపు 713 మంది గాయపడటానికి కారణమైన ముంబయి వరుస పేలుళ్ల ఘటనతో దేశం 1993లో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-13 05:21 GMT

257 మంది అమాయకుల ప్రాణాలు తీసి, దాదాపు 713 మంది గాయపడటానికి కారణమైన ముంబయి వరుస పేలుళ్ల ఘటనతో దేశం 1993లో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశ ఆర్థిక రాజధాని రక్తసిక్తమైంది. ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే.. ఈ కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌ స్టర్‌ అబూ సలెం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అతన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించడం జరిగాయి.

అవును... 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌ స్టర్‌ అబూ సలెం.. తాను భారత్‌ లో 25 ఏళ్ల జైలుశిక్ష పూర్తిచేసుకున్నానని కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా స్పందించిన సుప్రీంకోర్టు.. 2005 నవంబరులో అతడు అరెస్టయిన సంగతిని గుర్తుచేస్తూ.. శిక్షాకాలాన్ని ఏ విధానంలో లెక్కిస్తున్నారని, శిక్ష తగ్గింపు కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారా అంటూ జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం ప్రశ్నించింది.

వాస్తవానికి ఈ విషయంపై అతడు తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఇందులో భాగంగా... సత్ప్రవర్తన కారణంగా తగ్గించే శిక్షా కాలాన్ని కలుపుకొని చూస్తే భారత్‌ లో ఇప్పటికే తాను 25 ఏళ్ల జైలు జీవితాన్ని పూర్తిచేసుకున్నట్లవుతుందని.. కాబట్టి తనను విడుదల చేయాలని కోరాడు. అయితే... శిక్షాకాలం పూర్తయినట్లు కనిపించడం లేదంటూ ఆ వినతిని హైకోర్టు నిరుడు జులైలో తోసిపుచ్చింది. దీంతో.. అబూ సలెం సుప్రీంకోర్టు తలుపు తట్టాడు.

ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం.. అబూ సలెం టాడా చట్టం కింద దోషిగా తేలిన సంగతిని గుర్తుచేసింది. ఈ సందర్భంగా.. శిక్ష తగ్గింపును ఆ చట్టం అనుమతిస్తుందా అని సందేహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన అబూ సలేం తరుపు న్యాయవాది.. సంబంధిత నిబంధనలను ధర్మాసనం ముందు ఉంచుతానని విన్నవించారు. అందుకు రెండు వారాల గడువు ఇచ్చి.. తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి కోర్టు వాయిదా వేసింది.

కాగా... ముంబయి పేలుళ్ల కేసులో మరణశిక్షగానీ, పాతికేళ్లకుపైగా జైలుశిక్షగానీ విధించబోమన్న హామీపై పోర్చుగల్‌ నుంచి అబూ సలెంను భారత్‌ 2005 నవంబరు 11న వెనక్కి రప్పించిన సంగతి తెలిసిందే.

1993 మార్చి 12వ తేదీన ముంబయి మహానగరం నెత్తురోడింది. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలుకొని 3:40 గంటల వరకూ 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘోరం కారణంగా 257 మంది అమాయకులు చనిపోగా, దాదాపు 713 మంది గాయపడ్డారు. అంతకు 4 నెలల ముందు 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీమసీదు విధ్వంసం, తదనంతరం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ముంబైలోనూ చెలరేగిన మతఘర్షణలు ఈ బాంబు దాడులకు కారణంగా చెప్తారు.

Tags:    

Similar News