నటి ప్రత్యూష కేసు.. తుది తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు!

రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.;

Update: 2026-02-17 06:51 GMT

రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ విషాద ఘటన వెనుక ఉన్న మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ, నిందితుడు సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

టాలీవుడ్ లో ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష మరణం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనం. ఇక 2002లో జరిగిన ఈ ఘటనలో, ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి విషం తాగి ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రత్యూష ప్రాణాలు కోల్పోగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చలు, ఆందోళనలు జరిగాయి. సీబీఐ విచారణలో వారు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు తేలింది. చివరకు ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పిన నేరం కింద సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదైంది.

ఈ కేసు జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సుమారు 20 ఏళ్లకు పైగా సాగింది. 2004లో హైదరాబాద్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి, ఐదు వేలు జరిమాన, ఐదేళ్ల జైలు శిక్ష, విధించగా, 2011లో హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అదే సమయంలో ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా సిద్ధార్థ రెడ్డికి శిక్ష పొడిగించాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువురి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. సిద్ధార్థ రెడ్డి వెంటనే నాలుగు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని స్పష్టం చేస్తూ ఈ కేసుకు ముగింపు పలికింది.

Tags:    

Similar News