సుప్రీంకోర్టు సంచలన తీర్పు: ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆశలు గల్లంతు
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆమె పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.;
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం మైనింగ్ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆమె పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో ఆమె విషయంలో వేరే కేసుగా పొరపాటు పడి స్టే ఇచ్చామని, ఇప్పుడు తమ పొరపాటును సవరించుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పుతో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయని అంటున్నారు. ఈ విషయంలో ఆమెకు ఇక అన్నివైపుల నుంచి ఇబ్బందులు తప్పవని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుతోపాటు ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో శ్రీలక్ష్మి నిందితురాలుగా ఉన్నారు. 2009 డిసెంబరు 7న అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఓఎంసీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదైంది. 2012లో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఆమె కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లారు. దాదాపు 14 ఏళ్లు అవుతున్నా, ఈ కేసు విచారణ పూర్తి కాలేదు. దీంతో కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించగా, శ్రీలక్ష్మి సుప్రీంలో అప్పీలు చేశారు.
తొలుత ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేసింది. దీంతో శ్రీలక్ష్మికి కాస్త ఉపశమనం లభించినట్లైంది. అయితే సుప్రీం స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ అప్పీలు చేయడంతో జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. దీంతో శ్రీలక్ష్మి ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు.
ఓఎంసీ కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లినట్లు సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ వేశారు. అయితే గనులశాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ వాదనలు వినిపించింది. ఆ సమయంలో శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఆధారాలు సమర్పించినట్లు చెబుతున్నారు. శ్రీలక్ష్మి లంచం అడిగినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని కూడా సీబీఐ వెల్లడించింది. సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శ్రీలక్ష్మి పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ధర్మాసనం. తొలుత మరో పిటిషన్ గా భావించి పొరపాటున స్టే ఇచ్చామని జడ్జిలు పేర్కొన్నారు.