దీపం వెలిగిస్తే చాలు.. హిందూ మతంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

కేరళం రాష్ట్రంలోని శబరిమల ఆలయం సహా పలు దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2026-05-13 12:31 GMT

హిందూ మత విశ్వాసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం అంటే ఒక జీవన విధానమని అభివర్ణించిన ధర్మాసనం, హిందువుగా నిరూపించుకోడానికి గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని, గుడిసెలో (ఇంట్లో) దీపం వెలిగించినా చాలు అంటూ స్పష్టతనిచ్చింది. కేరళం రాష్ట్రంలోని శబరిమల ఆలయం సహా పలు దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు మతాలు పాటించే విశ్వాసాలు, ఆచార వ్యవహారాలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మొత్తం 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందూ మతాన్ని జీవన విధానం అంటారని, ఒక హిందువు తాను హిందువునని నిరూపించుకోడానికి తప్పనిసరిగా గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న స్పష్టత నిచ్చారు. ఏదైనా ఆచారం పాటించాల్సిన అవరసం లేదు ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయకుండా ఎవరూ ఆపలేరు అంటూ న్యాయమూర్తి తేల్చిచెప్పారు. ఒక హిందువు తన మత విశ్వాసాన్ని నిరూపించుకోడానికి ఇంట్లో దీపాన్ని వెలిగించుకున్నా సరిపోతుందని జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇక శబరిమల ఆలయ ప్రవేశంపై 2018లో సుప్రీం వెలువరించిన తీర్పుపై పునసమీక్షకు పలువురు పిటిషన్లు వేశారు. గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ 4:1 మెజార్టీతో అప్పట్లో ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు అప్పీలు చేయగా, 9మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణకు సీజేఐ ఆదేశించారు. గత 15 రోజులుగా విచారణ కొనసాగుతుండగా, బుధవారం పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ డాక్టర్ మోహన్ గోపాల్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా న్యాయవాది డాక్టర్ జి.మోహన్ గోపాల్ వాదనలు వినిపిస్తూ ‘హిందూ మతంలోని పలు వర్గాల నుంచే సామాజిక న్యాయం కోసం డిమాండ్లు వస్తున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. హిందూయిజాన్ని ఒక మతవర్గంగా నిర్వచించారని, మతం, తత్వశాస్త్రానికి సంబంధించి అనేక విషయాల్లో వేదాలను అత్యున్నత ప్రమాణంగా అంగీకరిస్తేనే హిందువుగా గుర్తిస్తారని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని న్యాయవాది మోహన్ గోపాల్ తెలిపారు. హిందువుల అందరి అభిప్రాయాలు తీసుకోకుండా గతంలో కోర్టులు ఒక నిర్ణయానికి వచ్చాయని అన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ‘‘అందుకే హిందూ మతాన్ని ఒక జీవన విధానంగా భావిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News