వారికి రిజర్వేషన్లు ఎందుకు...సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశంలో రిజర్వేషన్లు అన్నవి తప్పనిసరి అన్నది తెలిసిందే. ఆర్థిక సామాజిక అసమానతలు తొలగిపోనంతవరకూ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అన్నది ఒక విధంగా సాగుతోంది.
దేశంలో రిజర్వేషన్లు అన్నవి తప్పనిసరి అన్నది తెలిసిందే. ఆర్థిక సామాజిక అసమానతలు తొలగిపోనంతవరకూ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అన్నది ఒక విధంగా సాగుతోంది. ఇవి గత ఎనిమిది దశాబ్దాలుగా దేశంలో అమలులో ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల విషయంలో న్యాయ స్థానాలలో ఎప్పటికప్పుడు ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలు అవుతూనే ఉంటున్నాయి. వాటి మీద సుప్రీం కోర్టు విచారణలు చేయడం కూడా జరుగుతోంది. తాజాగా చూస్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు తావిస్తున్నాయి.
తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు :
ఇక ఒక కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నపుడు ఆ కుటుంబానికి రిజర్వేషన్లు కొనసాగించవచ్చా అన్న దాని మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారుల పిల్లలకు ఓబీసీ కోటా ప్రయోజనాలను కొనసాగించడాన్ని భారత సుప్రీంకోర్టు మౌఖికంగా ప్రశ్నించింది. కర్ణాటకలో క్రీమీ లేయర్ మినహాయింపుకు సంబంధించిన ఒక పిటిషన్‌పైన తాజాగా విచారణ జరుపుతూ జస్టిస్ బీవీ నాగారత్న వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు అయినప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అని పేర్కొన్నారు. సరైన విద్య, ఆర్థిక సాధికారతతోనే గణనీయమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సామాజికంగా ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి వచ్చిన వారికి రిజర్వేషన్లు నిరవధికంగా కొనసాగకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రిజర్వేషన్ వ్యవస్థ నుండి రావాలి :
ఉన్నత ఉద్యోగాలలో ఉండి గణనీయమైన ఆదాయాలు సంపాదించే తల్లిదండ్రుల పిల్లలు చివరికి వారుగా రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలని తద్వారా అత్యంత నిరుపేద వర్గాలకు ప్రయోజనాలు చేరాలని న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఉన్నత వర్గాలను మినహాయించడానికి అనేక ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని తరచుగా కోర్టులలో సవాలు చేస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. క్రీమీలేయర్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అంతిమంగా శాసనసభ కార్యనిర్వాహక వర్గాలదేనని స్పష్టం చేసింది. ఇదే తీరున కొనసాగితే మాత్రం మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని కోర్టు పేర్కొంటూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
వారికి అందని ఫలాలు :
ఉన్నత వర్గాలే అనేక సార్లు అవకాశాలను అందుకుంటే అదే సామాజిక వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలు కేవలం కొందరికే పరిమితం కాకుండా, సమాజంలో చిట్ట చివరి వరకూ చేరాల్సిన అవసరం అయితే ఉందని కోర్టు పేర్కొంది.