జైలు పాలవుతున్న జెన్ జెడ్.. ఎంత పెద్ద నెంబరో తెలుసా..!
అవును... తెలంగాణలో 2025లో జైలు శిక్ష పడిన జెన్ జెడ్ సంఖ్య షాకింగ్ గా మారింది.;
దేశ భవిష్యత్తులో జెన్ జెడ్ దే కీలక పాత్ర అనే సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. అమేయ శక్తి, సంకల్ప బలం జెన్ జెడ్ లో ఉందని, జాతి నిర్మాణంలో వారు ముందు వరుసలో ఉన్నారని.. అపార సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు వారి సొంతమని ప్రధాని మోడీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది ఒక వైపు అయితే.. మరోవైపు రకరకాల కారణాలతో జైలు పాలవుతున్న జెన్ జెడ్ జనం సంఖ్య కూడా భారీగా ఉందనే విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
అవును... తెలంగాణలో 2025లో జైలు శిక్ష పడిన జెన్ జెడ్ సంఖ్య షాకింగ్ గా మారింది. తాజా గణాంకాల ప్రకారం.. 2025 సంవత్సరంలో తెలంగాణలో మొత్తం 42,566 మందిని జైలుకు పంపినట్లు నివేదికలు చెబుతుండగా.. అందులో ఎక్కువ మంది జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారని అంటున్నారు. ఇందులో భాగంగా... 2025లో 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల 19,413 మంది వ్యక్తులు జైలుకు వెళ్లారు. ఇందులో ఎక్కువమంది జెన్ జెడ్!
ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. 42,556 మందిలో దాదాపు 40,090 మంది మొదటిసారి నేరస్థులుగా జైలుకు వెళ్లినవారే. ఇందులో డ్రంక్ & డ్రైవ్ కేసులో 2,833 మంది జైలుకు వెళ్లగా.. సైబర్ నేరాలకు పాల్పడి 1,784 మంది.. పోక్సో కేసులో 4,176 మంది.. డ్రగ్స్ కేసుల్లో ఏకంగా.. 7,040 మంది.. హత్య కేసులో 3,260 మంది ఉన్నారు. అంటే.. ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారనే విషయం ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని భావించొచ్చు!
ఇదే క్రమంలో వీరిలో జైల్లో 6,573 మంది న్యాయసహాయం పొందగా.. 3,634 మంది బెయిలు పొందారు. 44 జైల్ అదాలత్ లు నిర్వహించి 1,158 కేసులు విచారించి 985 మందిని విడుదల చేశారు. ఇదే క్రమంలో.. నివృత్తి కార్యక్రమం ద్వారా చంచల్ గూడ, చర్లపల్లి, నిజామాబాద్ కేంద్ర కారాగారాల్లో డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి 2,915 మందికి స్క్రీనింగ్ చేసి.. 590 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.