నెల్లూరులో సీటూ ఫేటూ మారుతుందిట ?
నెల్లూరు జిల్లా అంటే రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతంగా చెప్పుకుంటారు. అక్కడ నుంచి ఎందరో రాజకీయంగా తెలుగు నాట కీర్తిని గడించారు.;
నెల్లూరు జిల్లా అంటే రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతంగా చెప్పుకుంటారు. అక్కడ నుంచి ఎందరో రాజకీయంగా తెలుగు నాట కీర్తిని గడించారు. అలాంటి నెల్లూరు జిల్లాలో ఇపుడు రాజకీయ కలకలం రేగుతోంది. మరో అయిదు నెలలలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అవుతుంది. ఈ ఏడాది కచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. అందులో కొంత మందిని పక్కన పెడతారు అని గట్టిగా వినవస్తున్న మాట. ఇదే ఇపుడు పెద్ద ఎత్తున ప్రచారంగా సాగుతోంది.
కీలక జిల్లా :
వైసీపీకి అంతకు ముందు కాంగ్రెస్ కి అడ్డా లాంటి నెల్లూరు జిల్లాలో తొలిసారిగా టీడీపీ కూటమి పూర్తి ఆధిక్యత సాధించింది. పదికి పది సీట్లను తన ఖాతాలో వేసుకోవడమే కాదు ఎంపీని కూడా గెలుచుకుంది. వైసీపీ పోటీకి వచ్చాక 2014, 2019లలో టీడీపీకి ఈ జిల్లాలో ఎదురుగాలే వీచింది అలాంటి చోట బ్రహ్మరథం పట్టారు. దాంతో నెల్లూరు జిల్లాలో అదే రాజకీయాన్ని పదిలపరచుకోవాలని టీడీపీ కూటమి భావిస్తోంది ఇక 2024లో ప్రభుత్వం ఏర్పాటు అయినపుడు ఈ జిల్లా నుంచి సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డికి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆయనకు దేవాదాయ శాఖను కేటాయించారు. అయితే ఎంతో సీనియర్ అయిన తనకు కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తారని ఆయన ఊహించారు. కానీ అలా కాకపోవడంతో ఆయన తన శాఖ వరకూ మాత్రమే రియాక్ట్ అవుతున్నారు, పరిమితంగానే ఆయన రాజకీయం కూడా ఉంది అని అంటున్నారు.
ఆయనకు నో చాన్స్ :
ఈ నేపధ్యంలో ఆనం కి ఈసారి చాన్స్ ఉండకపోవచ్చు అని జిల్లాలో గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది. ఇక ఈ జిల్లాలో ఎపుడు మంత్రి పదవి ఇవ్వాలన్నా మొదటి పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదే అవుతుంది. ఆయన ఎమ్మెల్యేగా ఓటమి చెందినా 2014లో ఎమ్మెల్సీని చేసి మరీ వ్యవసాయ శాఖ వంటి కీలక శాఖను అప్పగించారు అలాంటిది ఈసారి సర్వేపల్లి నుంచి గెలిచి వచ్చినా ఎమ్మెల్యేగా ఉండిపోయారు. దాంతో ఆయనకు కనుక చాన్స్ ఇస్తే మాత్రం కేబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. ఒకవేళ కాదు అనుకుంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన డైనమిక్ లీడర్ నెల్లూరు రూరల్ కి చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఆయన పదవికి అర్బన్ నుంచి మంత్రిగా ఉన్న నారాయణ అడ్డు అవుతారని అంటున్నారు. ఒకే పరిధిలో ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే జిల్లా మొత్తం మీద ప్రాంతీయ సమతూకం దెబ్బ తింటుంది అని అంటున్నారు.
ఆమెకు ష్యూర్ నా :
ఈ నేపధ్యంలో మహిళ, రెడ్డి సామాజిక వర్గం, అంగబలం అర్ధం బలం అన్నీ చూసుకుంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు సైతం బలంగా వినిపిస్తోంది అని అంటున్నారు. ఆమె వైసీపీకి కంచుకోట లాంటి కోవూరు నుంచి గెలుపొందారు. ఇక్కడ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014, 2019 లలో వరసగా గెలిచారు అంతకు ముందు కూడా గెలిచారు. కానీ 2024లో ఓటమి చెందారు, ఆయన పలుకుబడిని దెబ్బ తీసి టీడీపీకి గట్టి పునాదులు వేయాలి అనుకుంటే కనుక ఆమెకే చాన్స్ అంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో రెండవ మంత్రి పదవి కీలక రెడ్ల మధ్యనే చక్కర్లు కొడుతోంది అని అంటున్నారు. ఈ మొత్తం ప్రచారంలో ఒక్క విషయం ఏమిటి అంటే ఆనం కి మంత్రి పదవీ వియోగం తప్పదని. చూడాలి మరి ఏమి జరుగుతుందో.