సెంచరీ మణులు... జపాన్ మహిళల సరికొత్త రికార్డ్ ఇదే!

బ్రతకాలనుకుంటే మాకన్నా ఆరోగ్యంగా, మా కంటే ఎక్కువకాలం ఎవరూ బ్రతకలేరు అని అంటున్నారు జపాన్ లోని మహిళలు.;

Update: 2026-01-13 05:57 GMT

బ్రతకాలనుకుంటే మాకన్నా ఆరోగ్యంగా, మా కంటే ఎక్కువకాలం ఎవరూ బ్రతకలేరు అని అంటున్నారు జపాన్ లోని మహిళలు. ఈ సందర్భంగా వారు సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇందులో భాగంగా... 100 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్యలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ జనాభా 99,763 మంది ఉండటం గమనార్హం. ఇది వరుసగా 55వ సంవత్సరం వృద్ధిని నమోదు చేసిందని చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వారిలో 88% మంది మహిళలే!

అవును... జపాన్ ప్రపంచంలోనే అత్యధికంగా శతాబ్దాలు నిండిన వారికి నిలయంగా మారింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 2025 నాటికి ఈ దేశంలో 100 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది. దీంతో.. ఈ జీవితకాల దీర్ఘాయువుకు నిజంగా దారితీసేది ఏమిటి? అనే చర్చ తెరపైకి వచ్చింది. దానికి సమాధానంగా.. వారి సంప్రదాయ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమనే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని చెబుతున్నారు.

ఈ విషయంపై స్పందించిన ఢిల్లీలోని సిటీ ఇమేజింగ్ & క్లినికల్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆకార్ కపూర్.. జపాన్‌ లో దీర్ఘాయువు కేవలం ఆహారం వల్ల మాత్రమే కాదని.. ఇది క్రమశిక్షణతో కూడిన, చురుకైన, సామాజికంగా అనుసంధానించబడిన జీవన విధానంలో పొందుపరచబడిన ఆహారపు అలవాట్ల సంచిత ప్రభావమని అంటున్నారు. ఇదే సమయంలో... ఎంత అనేదే కాకుండా.. ఆహారాన్ని ఎలా తీసుకుంటారనేది కూడా అంతే ముఖ్యం అని ఆయన అంటున్నారు.

నియంత్రణగా తినడం, కడుపు నిండినట్లు అనిపించే ముందు ఆపేయడం వంటి పద్ధతులు దశాబ్దాలుగా జీవక్రియ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా.. ప్రాసెస్ చేసిన ఆహారానికి, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం కూడా వారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తెలిపారు.

ఇక.. జపాన్‌ లోని వందేళ్లు నిండిన వారిలో దాదాపు 88% మంది మహిళలలే ఉండటానికీ పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. స్త్రీలు జీవితం ప్రారంభంలోనే హార్మోన్ల రక్షణ నుండి, ముఖ్యంగా 'ఈస్ట్రోజెన్' హార్మోన్ గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుందని.. వారు ఆక్సీకరణ ఒత్తిడి, సెల్యులార్ వృద్ధాప్యానికి ఎక్కువ నిరోధకతను చూపుతారని డాక్టర్ కపూర్ వివరించారు. అక్కడ స్త్రీలు ఎక్కువ చురుగ్గా ఉంటారని.. స్క్రీనింగ్‌ లు కోరడం, వైద్య సలహాలను పాటించడం చేస్తారని అన్నారు.

ఇదే క్రమంలో... ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కేవలం జీవసంబంధమైనది కాదని.. ఇది చాలా సామాజికమైనది, మహిళలు ఆ సామాజిక బఫర్‌ లను మెరుగ్గా నిర్వహించడానికి మొగ్గు చూపుతారని ఆయన జతచేస్తారు.

ఇదే సమయంలో.. జపాన్ ప్రజల దీర్ఘాయువు వెనుక ఆ దేశ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉందని.. ఆ దేశంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకుండా చూసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తారని డాక్టర్ కపూర్ తెలిపారు. రోజువారీ నడక, ఇంటి పనులు, హాబీలలో నిమగ్నం కావడం, బలమైన సామాజిక బంధాలు జపాన్ ప్రజల ఆయుష్షును పెంచుతున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News