లక్ష మంది వీసాలు రద్దు చేసిన ట్రంప్.. ప్రపంచానికి మరో షాక్
అమెరికా భారీగా వీసాలను రద్దు చేసింది. 2025లో లక్ష విసాలు రద్దు చేసినట్టు ప్రకటించింది.;
అమెరికా భారీగా వీసాలను రద్దు చేసింది. 2025లో లక్ష విసాలు రద్దు చేసినట్టు ప్రకటించింది. 2024లో 40 వేల వీసాలు రద్దు చేయగా.. 2025 ఆ సంఖ్య రెట్టింపయింది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసాల రద్దు పెరిగింది. రద్దయిన వీసాల్లో దాదాపు 8000 విద్యార్థులవి కాగా.. 2500 ప్రత్యేక వీసాలు. అమెరికా నిరంతరం వీసాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగబోతుందని ప్రకటించింది.
కారణం ఏంటి ?
వీసాలు రద్దు చేయడానికి అమెరికా నాలుగు కారణాలు చెబుతోంది. అందులో మొదటిది.. అమెరికా భద్రతా బలగాలతో పోట్లాడిన వారి వీసాలు. రెండోది తాగి వాహనం నడిపినవారు. మూడోది.. గడువు ముగిసినా అమెరికాలో ఉన్న వారు. నాలుగోది.. మోసాలకు, నేరాలకు పాల్పడిన వారివి. దేశంలో శాంతిభద్రతలే తమకు ముఖ్యమని అమెరికా పేర్కొంది. వీసాల నిరంతర పరిశీలన కొనసాగుతుందని అమెరికా తెలిపింది.
ఎవరిపై ప్రభావం ..
భారీస్థాయిలో వీసాల రద్దు ప్రక్రియ అమెరికాలోని విదేశీ నిపుణులను, యూనివర్శిటీ విద్యార్థులను ఆలోచనలో పడేసింది. విదేశీ విద్యార్థులపైన, స్కిల్డ్ నిపుణులపైన ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2026లో కూడా వీసాల పరిశీలన కొనసాగుతుందని, అదే సమయంలో రద్దు కూడా ఉంటుందని అమెరికా చెబుతోంది. ప్రజల భద్రత, జాతీయ భద్రతను బలోపేతంగా చేసే దిశగా పాలసీ ఉందని అమెరికా ప్రకటించింది.
రద్దు కాకుడదంటే.. ?
అమెరికా వీసా రద్దు కాకూడదంటే.. ఖచ్చితంగా ఆ దేశ నిబంధనలు పాటించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. లేదంటే వీసా రద్దు అవుతుందని, ఫలితంగా అమెరికాలో ఉంటున్న విదేశీయుల ఉద్యోగాలు, చదువు ప్రమాదంలో పడతాయని హెచ్చరిస్తున్నారు. తమ దేశ భద్రత దృష్ట్యా వీసాలను ఎడపెడా ఇచ్చే పరిస్థితి లేనట్టు అమెరికా స్పష్టంగా చెబుతోంది. తమ నిబంధనలు ఆమోదించేవారే దేశంలో ఉండాలని అమెరికా తేల్చిచెబుతోంది. దీంతో విద్యార్థులు, స్కిల్డ్ నిపుణుల్లో కొంత ఆందోళన నెలకొంది.