సంక్రాంతి బరిలో గెలిచేది కోడేనా ?

మన ఆచారాలు సంప్రదాయాలలో వినోదం ఉంది, అలాగే జీవ హింస వద్దు అని కూడా ఉంది.;

Update: 2026-01-13 07:40 GMT

మన ఆచారాలు సంప్రదాయాలలో వినోదం ఉంది, అలాగే జీవ హింస వద్దు అని కూడా ఉంది. అయితే కోడి పందేలు సరదాగాఆడడం అన్నది ఉంది కానీ కత్తులు కాళ్ళకు కట్టి దారుణమైన పోటీలకు అవకాశం ఇవ్వడం ఎక్కడా లేదు. అయితే కాలక్రమంలో చూస్తే కనుక కోడి పందేలు అన్నవి చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఇందులోకి బడా శక్తులు కూడా రంగంలోకి దిగడంతో పాటు లక్షల రూపాయలు చేతులు మారడం సైతం జరుగుతోంది. దాంతో కోడి పందేల మీద న్యాయ స్థానాలు సీరియస్ అవుతున్నాయి. కఠినమైన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. కోడి పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తాజాగా ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా జిల్లా అధికార యంత్రాంగానికి జారీ చేసింది.

తనిఖీలు చేసి :

ఇక గ్రామ స్థాయిలో కోడి పందేలు ఎక్కడ కూడా జరగకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని కోరింది. అంతే కాదు, కేసులు కూడా పెట్టాలని ఆదేశించింది. ఈ విషయంలో దిగువ స్థాయి అధికారులు ఎవరైనా కూడా తగిన విధంగా వ్యవహరించకపోతే క్రమశిక్షణ చర్యలను తీసుకునే అధికారాన్ని కూడా జిల్లా యంత్రాంగానికి ఇచ్చింది. ఈసారి సంక్రాంతికి ముందే ఈ విధంగా కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. మండల గ్రామ స్థాయిల వరకూ పోలీసులు రెవిన్యూ అధికారులతో కూడిన బృందాలు కోడి పందేలు జరగకుండా జల్లెడ పట్టాలని సూచనలు ఉన్నాయి.

గోదావరిలో సందడి :

ఇదిలా ఉంటే బుధవారం నుంచి గోదావరి ప్రాంతంలో కోడి పందేలకు రంగం సిద్ధం అవుతోంది. పల్లెలన్నీ పందేల హోరుతో ఒక్క లెక్కన జూలు విదిలించుకుంటున్న నేపధ్యం ఉంది. కోడి పందేలు నిర్వహణ కోసం బరులు సైతం పూర్తి స్థాయిలో సిద్ధం అయిపోయార్యి. ఇక లెక్క చూస్తే ప్రతీ రెండు గ్రామ పంచాయతీలకు ఒకటి చొప్పున బరులని సిద్ధం చేస్తున్నారు. ఇక మరి కొన్ని చోట్ల అక్కడి గ్రామాలలో రెండేసి బరులు ఏర్పాటు చేసి మరీ పందేలకు సై అంటున్నారు.

కేపీఎల్ అంటూ :

కోడి పందేలకు కూడా ఒక లీగ్ ఉంది అంటున్నారు. కోడి పందేల లీగ్ కేపీఎల్ అంటూ పెద్ద ఎత్తున దీనిపైన కూడా చర్చ జరుగుతోంది. ఏపీ అలాగే తెలంగాణా జిల్లాలలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేలు అన్నవి సాధారణం అయిపోయాయి. చట్టపరమైన ఆంక్షలు న్యాయపరమైన ఆదేశాలు ఒక వైపు ఉంటే భారీ స్థాయిలో బెట్టింగులు తో కోడి పందేలు జోరు చేస్తున్నాయి. ఆ విధంగా నిర్వాహకులు రహస్య బరులని ఏర్పాటు చేస్తూ తమ హవా సాగించేస్తున్నారు.

నిఘా పెడుతున్నా :

కోడి పందెం రాయుళ్ళు వారితో పాటు స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అలాగే బిగ్ షాట్స్ వ్యాపార ప్రముఖులు అంతా పెద్ద ఎత్తున ఈ కోడి పందేలలో పాల్గొంటున్నారు. ఇక కోడి పందేలు జరగకూడదని పట్టుదలతో పోలీసులు నిఘా పెట్టారు. అయినా ఎవరూ ఎక్కడా తగ్గకపోవడమే విశేషం. రాత్రివేళల్లో రహస్యంగా నిర్వహించే ఈ కోడి పందేలు అలాగే లక్షలు, కోట్లు చేతులు మారడం వంటి వ్యవహారాలు ఈ సంక్రాంతికి కూడా కీలకంగా ఉండబోతున్నాయి అంటున్నారు. కోడి పందేలు కాయడం తప్పు ఎవరైనా అలా చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని ఒక వైపు పోలీసు అధికారులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు.

సందడే సందడి :

మరో వైపు చూస్తే సంక్రాంతి పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దాంతో ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కోడి పందేల బరులు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నాయి ఇంకో వైపు నుంచి చూస్తే బయట ప్రాంతాల నుంచి కోడి పందెం రాయుళ్ళుభారీగానే ఈ ప్రాంతాలకు తరలివస్తున్నారు. పోలీసుల నిఘా, చట్టపరమైన ఆంక్షల వల్ల కోడి పందేలు రహస్యంగా రాత్రివేళల్లో, వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విధంగా చేసే నిర్వాహకులు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా ఎక్కడా ఆగుతాయా అన్నదే చర్చగా ఉంది.

గెలిచేది ఎవరు :

ఇదిలా ఉంటే కోడి పందేలు జరుగుతాయా లేక ఆపుతారా అన్నది చూడాల్సి ఉంది. ప్రతీ ఏడాది కోడి పందెం కట్టి మరీ గెలుస్తోంది. కత్తి కట్టి మరీ కదం తొక్కుతోంది. ఈసారి కోడి గెలుస్తుందా అంటే రానున్న మూడు రోజులలో ఏమిటి అన్నది తేలిపోతుంది.

Tags:    

Similar News