తక్కువ ఖర్చు.. ఎక్కువ నష్టం.. ఇరాన్ ‘డ్రోన్’ వ్యూహంతో పాశ్చాత్య దేశాలకు ఆర్థిక సవాలు!

సాధారణంగా యుద్ధాల్లో అధునాతన ఆయుధాలు.. అత్యాధునిక సాంకేతికతే విజయాన్ని నిర్ణయిస్తాయని భావిస్తారు.;

Update: 2026-03-04 05:08 GMT

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య యుద్ధ తంత్రాలు కూడా వేగంగా మారుతున్నాయి. సాధారణంగా యుద్ధాల్లో అధునాతన ఆయుధాలు.. అత్యాధునిక సాంకేతికతే విజయాన్ని నిర్ణయిస్తాయని భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇరాన్ అవలంభిస్తున్న వ్యూహం మాత్రం ఆ అభిప్రాయాన్ని సవాలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఆయుధాలతో ప్రత్యర్థికి భారీ ఆర్థిక భారం మోపడం ద్వారా యుద్ధాన్ని గెలవాలనే కొత్త విధానాన్ని ఇరాన్ అనుసరిస్తోంది. ఈ వ్యూహాన్ని సైనిక నిపుణులు “అట్రిషన్ వార్” లేదా “కాస్ట్ వార్”గా విశ్లేషిస్తున్నారు.

ఇరాన్ తయారు చేస్తున్న షాహెద్–136 డ్రోన్లు ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి చిన్న క్రూయిజ్ మిస్సైళ్లలా పనిచేసే వన్‌వే అటాక్ డ్రోన్లు. లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోవడం వల్ల వీటిని సాధారణంగా “సూసైడ్ డ్రోన్లు”గా కూడా పిలుస్తారు. అత్యాధునిక యుద్ధ సాంకేతికతతో తయారైన అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఎదుర్కోవడానికి ఇరాన్ ఈ తక్కువ ఖర్చు డ్రోన్లనే ప్రధానంగా వినియోగిస్తోంది.

ఒక్కో షాహెద్ డ్రోన్ తయారీకి సుమారు 20 వేల డాలర్లు.. అంటే దాదాపు రూ.16–17 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుంది. అయితే ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు మాత్రం కోట్లలో ఉంటుంది. ఉదాహరణకు అమెరికా ఉపయోగించే పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థలో ఒక్క ఇంటర్‌సెప్టర్ మిస్సైల్ ధర రూ.30–33 కోట్ల వరకు ఉంటుంది. అంటే సుమారు రూ.17 లక్షల విలువైన డ్రోన్‌ను కూల్చేందుకు దాదాపు రూ.30 కోట్ల విలువైన క్షిపణిని వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ వ్యవస్థలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఐరన్ డోమ్‌లో ఉపయోగించే టామిర్ ఇంటర్‌సెప్టర్ మిస్సైళ్ల ధర ఒక్కొక్కటి సుమారు రూ.35 నుంచి 45 లక్షల వరకు ఉంటుంది. ఇది పేట్రియాట్ మిస్సైళ్లతో పోలిస్తే తక్కువైనా తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లతో పోలిస్తే ఇది కూడా గణనీయమైన వ్యత్యాసమే. ఇక అమెరికా విమానాల నుంచి ప్రయోగించే సైడ్‌వైండర్ వంటి క్షిపణుల ధర మరింత ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు పెద్ద సవాలుగా మారుతోంది. యుద్ధం తక్కువ కాలం మాత్రమే కొనసాగితే ఈ ఖర్చు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన రక్షణ క్షిపణుల నిల్వలు వేగంగా తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల వద్ద ఉన్న మిస్సైల్ నిల్వలు కొన్ని రోజులు లేదా వారాలకు మాత్రమే సరిపోతాయని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో వేల సంఖ్యలో డ్రోన్లను తయారు చేసి ప్రయోగించే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడానికి ప్రత్యర్థి భారీ సంఖ్యలో క్షిపణులను వినియోగించాల్సి వస్తుంది. దీంతో ఆర్థికంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ప్రత్యర్థి బలహీనపడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో “ఎవరి దగ్గర ఆయుధాలు ముందుగా అయిపోతాయి?” అన్న ప్రశ్న ఇప్పుడు ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారుతోంది. ఇరాన్ తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ఒత్తిడిని కొనసాగించగలిగితే.. అమెరికా– ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఆర్థికంగా వ్యూహాత్మకంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఖరీదైన ఆయుధాల యుగంలో కూడా తక్కువ ఖర్చుతో తయారయ్యే సాంకేతిక పరిజ్ఞానం యుద్ధ సమీకరణాలను ఎలా మార్చగలదో ఇరాన్ వ్యూహం ప్రపంచానికి మరోసారి చూపిస్తోంది. ఈ “కాస్ట్ వార్” ఎటు దారి తీస్తుందో అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తున్న అంశంగా మారింది.

Tags:    

Similar News