తమిళ పాలిటిక్స్‌లో అన్నామలై సునామీ.. 10 గంటల్లో 10 లక్షల మందితో రికార్డు!
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆయన తాజాగా ప్రారంభించిన ‘పొలిటికల్ మూవ్‌మెంట్’ సోషల్ మీడియాతోపాటు క్షేత్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు అన్నామలై ప్రకటించిన 10 గంటల్లోనే 10 లక్షల మంది సభ్యులుగా రిజిస్టర్ చేసుకోవడం తమిళ రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డుగా నిలిచిందని అంటున్నారు. ఈ అద్భుతమైన స్పందనపై అన్నామలై స్పందిస్తూ, తన పిలుపును అందుకుని భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అన్నామలై ప్రారంభించిన రాజకీయ ఉద్యమానికి ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో సంప్రదాయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గుబులు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ స్పందన మారుతున్న రాజకీయ దృక్పథానికి సంకేతామా? అంటూ సందేమాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షతో పనిచేస్తున్న అన్నామలై ఒక వ్యూహంతో తన పోరాటాన్ని ప్రారంభించారని అంటున్నారు. ప్రస్తుతం పొలిటికల్ మూమెంట్ పేరుతో యువత, తటస్థులను ఆకర్షిస్తున్న అన్నామలై తర్వాత దశలో రాజకీయంగా వారిని వినియోగించుకోవాలని ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
అన్నామలై ప్రారంభించబోయే పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు వేసేందుకు ఈ రాజకీయ ఉద్యమం పనికి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అన్నామలై కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఉద్యమం పూర్తిస్థాయిలో బలోపేతమయ్యాక, సరైన సమయం చూసి ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారుస్తానని అన్నామలై ఇప్పటికే స్పష్టం చేశారని అంటున్నారు. కాగా, ఈ పరిణామాలు బీజేపీ పెద్దలను కలవర పెడుతున్నాయని అంటున్నారు. తమిళనాడులో ఎదగాలనే ఆ పార్టీ కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటోంది. ఎట్టకేలకు అన్నామలై రూపంలో ఉనికి చాటుకున్నా, ఇప్పుడు ఆయన బయటకు రావడంతో మళ్లీ యథాస్థితికి వచ్చినట్లే ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి అన్నామలై నిష్క్రమణతో ఆయనే ఎక్కువగా నష్టపోతారని బీజేపీ భావించిందని అంటున్నారు. కానీ, యువ పోలీసు అధికారిగా యువతలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న అన్నామలై తన పొలిటికల్ మూమెంటుతో అదరగొడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 10 లక్షల రిజిస్ట్రేషన్లతో తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు భిన్నమైన ‘కొత్త తరం రాజకీయాన్ని’ ఆయన తీసుకురాబోతున్నారనే చర్చ నడుస్తోంది.