ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నో.. ఇన్‌స్టాలో రీల్స్ చేయాలంటూ మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!

తాజా క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం.. మంత్రి రాజీనామా కంటే వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ఏకైక పరిష్కారమని భావిస్తోంది.

Update: 2026-07-24 18:39 GMT

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను అంగీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం.. మంత్రి రాజీనామా కంటే వ్యవస్థను ప్రక్షాళన చేయడమే ఏకైక పరిష్కారమని భావిస్తోంది.

ఎన్.టీఏలో 47 మంది అధికారులపై వేటు?

విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ను పక్కనబెట్టిన కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టీఏ)లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. పారదర్శకతను పెంచేందుకు ఎన్.టీఏలోని సుమారు 47 మంది అధికారులను బదిలీ లేదా తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం ద్వారా విద్యార్థుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు నీట్ లీకేజీ అంశంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

మంత్రులకు మోదీ ‘ఇన్‌స్టా’ పాఠాలు

ఇదే క్యాబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులకు మరో ఆసక్తికరమైన సూచన చేశారు. "మీలో ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారు?" అని నేరుగా ప్రశ్నించిన మోదీ.. నేటి యువత ఎక్కువ సమయం ఇన్‌స్టాగ్రామ్‌లోనే గడుపుతున్నారని గుర్తుచేశారు.

ప్రధాని కీలక ఆదేశాలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సాంప్రదాయ ప్రకటనల ద్వారా కాకుండా డిజిటల్ రూపంలో చేరవేయాలి. దీనికోసం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, షార్ట్ వీడియోలు, ఇంటరాక్టివ్ కంటెంట్‌ను నిరంతరం పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

యువతతో నేరుగా అనుసంధానం కావడానికి సోషల్ మీడియానే అత్యంత ప్రభావవంతమైన సాధనమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేయడం గమనార్హం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యూహంలో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల పాత్ర మరింత పెరగనుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News