కేంద్రంలో సరికొత్త రికార్డు.. రెండు బిల్లుల కోసం బీజేపీ పాట్లు!
దేశ పార్లమెంటరీ చరిత్రలోనే సరికొత్త, అరుదైన రికార్డు నమోదైంది. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడినా, సమావేశాలు ముగిసినట్లు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు.
దేశ పార్లమెంటరీ చరిత్రలోనే సరికొత్త, అరుదైన రికార్డు నమోదైంది. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడినా, సమావేశాలు ముగిసినట్లు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు. గతంలో ఎన్నడూ లేనట్లు సభ వాయిదా పడిన 40 రోజులకు కూడా ప్రొరోగ్ ప్రకటన రాకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిని బట్టి మళ్లీ సభను సమావేశపర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి సభ నిరవధిక వాయిదా వేసిన మూడు నాలుగు రోజులకు సమావేశాలు ముగిసినట్లు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ ఈ సారి అటువంటి ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. ఆగస్టు 13న పార్లమెంటు ఉభయ సభలను వాయిదా వేశారు. నేటికి 40 రోజులు అవుతున్నా, సమావేశాలపై ప్రొరోగ్ ప్రకటన రాకపోవడంతో ప్రభుత్వ వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది.
పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించుకోవడం కోసమే పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రొరోగ్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని భావిస్తున్నారు. నిజానికి వర్షాకాల సమావేశాల్లోనే ఈ రెండు బిల్లుల ఆమోదం కోసం కేంద్రం అనేక వ్యూహాలు రచించింది. కానీ, కేంద్ర పెద్దలు ఎంత ప్రయత్నించినా రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన 2/3వంతు మెజార్టీ లభించలేదని చెబుతున్నారు. దీంతో సమావేశాలు తాత్కాలికంగా వాయిదా వేసి కొద్దిరోజుల్లోనే తిరిగి సమావేశపర్చాలని, ఈలోగా ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి బిల్లుల ఆమోదానికి రూట్ క్లియర్ చేసుకోవాలని కేంద్ర పెద్దలు భావించారని అంటున్నారు.
అయితే కేంద్ర పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా కొన్ని ప్రాంతీయ పార్టీలు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో దారికి రావడం లేదని అంటున్నారు. ప్రధానంగా 22 ఎంపీ స్థానాలు ఉన్న డీఎంకే పార్టీపై కేంద్ర నాయకత్వం చాలా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇండి కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే తమతో చేతులు కలిసి ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ అగ్రనేతలు అంచనా వేశారని అంటున్నారు. కానీ, ఆ రాష్ట్ర రాజకీయాలు, తమ సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డీఎంకే వెనక్కి తగ్గుతుందని అంటున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపితే జాతీయ రాజకీయాల్లో తమిళనాడు ప్రభావం తగ్గిపోతుందనే ఆందోళనతో డీఎంకే వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోందని అంటున్నారు. అదే సమయంలో రాజకీయ వాతావరణం మారకపోతుందా? అన్న ఆలోచనతో కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రొరోగ్ చేయకుండా బీజేపీ నేతలు వేచి చూస్తున్నారని అంటున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 40 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండటమే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పెండింగులో ఉన్న రెండు బిల్లులను గట్టెక్కించే మార్గాలపై కేంద్ర పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో విపక్షంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు కూడా నెరవేరడం లేదని అంటున్నారు. ఇండి కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఉద్ధవ్ శివసేన, ఎన్సీపీ పవార్ పార్టీలతో సంప్రదించినా ఇంకా 2/3 వంతు మెజార్టీకి చేరువ కాలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ వ్యూహాలపై ఉత్కంఠ ఎక్కువ అవుతోంది.