ఏఐ కాదు.. ఇక నుంచి సూపర్ ఇంటెలిజెన్స్.. ట్రంప్ ఏం చేస్తాడో ఏమో..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఈ పదానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరు పెట్టారు.

Update: 2026-09-23 06:07 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఈ పదానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరు పెట్టారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే పదానికి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) అనే పదాన్ని ఉపయోగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

“ఆర్టిఫిషియల్” అనే పదం వినగానే ఏదో నకిలీ లేదా కృత్రిమమైన విషయంలా అనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదని.. ఇది అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమని పేర్కొన్నారు. అదే సమయంలో దీన్ని ఉపయోగించడంలో జాగ్రత్త అవసరమని కూడా అన్నారు.

అమెరికా పత్రాల్లో ఇక ఎస్ఐ

ట్రంప్ ప్రకారం.. ఇక నుంచి అమెరికాకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాల్లో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ” స్థానంలో “సూపర్ ఇంటెలిజెన్స్ ” అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ పదాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. “ఆర్టిఫిషియల్” కంటే “సూపర్’’ అనే పదం మరింత సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే సాంకేతిక రంగంలో సూపర్ ఇంటెలిజెన్స్ అనే పదానికి ఇప్పటికే ప్రత్యేకమైన అర్థం ఉంది. సాధారణంగా మానవుల సామర్థ్యాలను విస్తృత స్థాయిలో అధిగమించే భవిష్యత్ ఏఐ వ్యవస్థలను సూచించేందుకు ఈ పదాన్ని పరిశోధకులు ఉపయోగిస్తారు. అందువల్ల ప్రస్తుతం ఉన్న ఏఐ వ్యవస్థలన్నింటినీ “సూపర్ ఇంటెలిజెన్స్”గా పిలవడం సాంకేతిక పరంగా కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది.

ఏఐపై నియంత్రణకు ట్రంప్ వ్యతిరేకత

పేరు మార్పుతో పాటు ఏఐ నియంత్రణపై కూడా ట్రంప్ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐని నియంత్రించేందుకు రూపొందించే అంతర్జాతీయ వ్యవస్థలను అమెరికా అంగీకరించదని ఆయన అన్నారు. ఏఐ అభివృద్ధిని అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని.. పారిశ్రామిక విప్లవం కంటే కూడా ఈ సాంకేతికత పెద్దదిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే దీని అభివృద్ధిని ప్రోత్సహిస్తామని చెప్పారు.

ఏఐ వల్ల ప్రమాదాలు ఎదురవుతాయన్న హెచ్చరికలను కూడా ట్రంప్ తీవ్రంగా ప్రశ్నించారు. అదే సమయంలో సాంకేతికతను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే అమెరికా న్యాయ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇటీవలే పేరు మార్చే ఆలోచనపై చర్చ

ఏఐ పేరును మార్చాలనే ఆలోచన ట్రంప్‌కు ఒక్కసారిగా వచ్చినది కాదు. ఇటీవల ఆయన సోషల్ మీడియా ద్వారా ఏఐకి ప్రత్యామ్నాయ పేర్లపై తన అనుచరుల అభిప్రాయాలను కూడా కోరారు. “సూపర్ ఇంటెలిజెన్స్’’, “ఎక్స్ ట్రీమ్ ఇంటెలిజెన్స్’’ వంటి పేర్లు చర్చలోకి వచ్చాయి. చివరకు ఐక్యరాజ్యసమితి వేదికగా “సూపర్ ఇంటెలిజెన్స్’’ అనే పదాన్ని ప్రకటించారు.

అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ఈ మార్పు ఎంత విస్తృతంగా అమలవుతుంది, ఇతర దేశాలు దీనిని అనుసరిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా.. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ చర్చల్లో “ఏఐ”గా స్థిరపడిన పదానికి ప్రత్యామ్నాయంగా “ఏఐ”ని తీసుకురావాలన్న ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా కొత్త చర్చకు తెరలేపింది.

Tags:    

Similar News