నారా లోకేష్ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..
| విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి నారా లోకేష్‌ను ఉపాసన కొణిదెల ‘రాక్‌స్టార్ మినిస్టర్’ అంటూ ప్రశంసించారు. 16 నెలల్లో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకొచ్చిన ఆయన నాయకత్వాన్ని అభినందించారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని లోకేష్‌కు సూచించారు.
ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. ఏపీలో చంద్రబాబుకు సరితూగేలా పాలన, పార్టీలో నారా లోకేష్ కు అగ్రతాంబూలం దక్కుతోంది. లోకేష్ తన చాతుర్యంతో ఏపీలో ప్రజాదరణ పొందుతున్నారు. కేవలం పార్టీ నేతలు, ప్రజలవే కాదు పారిశ్రామికవేత్తల మనసులను కూడా దోచుకుంటున్నారు. ఫ్రెండ్లీ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఏపీ అభివృద్ధిలో కీలకంగా మారుతున్నారు. తాజాగా చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఉపాసన కొణిదెల నుంచి వచ్చిన ప్రశంసలే ఇందుకు తార్కాణంగా చెప్పొచ్చు.
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసింది. 'యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర' పేరుతో నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాసన కొణిదెల మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సదస్సులో భాగంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ‘రాక్‌స్టార్ మినిస్టర్’ అంటూ అభివర్ణించారు. బాధ్యతలు చేపట్టిన కేవలం 16 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన కనబరిచిన చొరవను.. యువ నాయకత్వ పటిమను ఉపాసన ప్రత్యేకంగా అభినందించారు. పారిశ్రామిక సదస్సులలో సాధారణంగా కేవలం గణాంకాలు.. ఒప్పందాల గురించే చర్చ జరుగుతుంది. కానీ ఈ వేదికపై ఒక యువ మంత్రి పనితీరుకు అందిన ఈ ప్రశంస రాష్ట్రంలో మారుతున్న పారిశ్రామిక వాతావరణానికి అద్దం పడుతోంది.
ఈ సంభాషణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆంధ్రప్రదేశ్‌ను ఒక డివైన్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలని ఉపాసన చేసిన విజ్ఞప్తి. తిరుమల శ్రీవారితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని.. చిత్తూరు జిల్లా అర్ధగిరి ఆలయ విశిష్టతను ఆమె గుర్తుచేసుకున్నారు. కేవలం పరిశ్రమలు, ఐటీ రంగాలకే పరిమితం కాకుండా.. మన రాష్ట్రానికి ఉన్న అపారమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, శ్రీకాళహస్తి వంటి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. భారీ పెట్టుబడుల ద్వారా యువతకు ఆధునిక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆలయాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన.. మెరుగైన రవాణా.. పర్యాటక ప్రాంతాల అనుసంధానం ద్వారా స్థానిక వ్యాపారులకు, కళాకారులకు ఉపాధి పెరుగుతుంది.
పారిశ్రామికాభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకం ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ముందుకు సాగితే ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని.. నారా లోకేష్ దీన్ని చేస్తారంటూ తన అభిలాషను ఉపాసన బయటపెట్టారు. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఆంధ్ర ప్రగతిలో కొత్త ఆధ్యాయాన్ని లిఖించడం ఖాయం.