ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..
| వైట్ హౌస్‌కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోని వాషింగ్టన్ డీసీ లోగాన్ సర్కిల్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు కథనం పేర్కొంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ట్రంప్ పాలనలో భద్రతా వైఫల్యాలపై ఈ ఘటనతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచానికి పెద్ద పోలీస్ గా బిల్డప్ ఇచ్చే ట్రంప్ సారూ.. తనసొంత దేశంలో అదీ తన ఇంటికి దగ్గర్లో ఎవడో వచ్చి ఐదుగురిని కాల్చి చంపి పారిపోతే కాపాడే దిక్కేలేకుండా పోయింది. ఈయన అట పోయి ఇరాన్ మీద దాడులు చేస్తాడట.. వెనిజుల అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తాడు.. గల్ఫ్ దేశాల్లో పెత్తనం చెలాయిస్తాడు.సొంత దేశాన్ని పౌరులను కాపాడుకోలేని పెద్ద మనిషి ప్రపంచంపై గుత్తాధిపత్యం వహిస్తాడట.. అందుకే అన్నారు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్ణానికి నిచ్చెన వేసిందట.. అలా ఉంది మన ట్రంప్ తాత పరిస్థితి.
అగ్రరాజ్యం అమెరికాకు గుండెకాయ లాంటి అధ్యక్ష భవనం 'వైట్ హౌస్'కు కేవలం కిలోమీటరన్నర దూరంలోనే తుపాకులు గర్జించాయి. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కీలకమైన లోగాన్ సర్కిల్ వద్ద ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ దుండగుడు ఏమాత్రం భయం లేకుండా అక్కడి నుంచి దర్జాగా పరారయ్యాడు.
సొంత దేశ పౌరులకు.. అదీ అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్నవారికి కనీస రక్షణ కల్పించలేని స్థితిలో యంత్రాంగం ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాల్పులు జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు, 'ది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్' ఏజెంట్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల పాఠశాలలకు లాక్‌డౌన్ విధించి.. ప్రజలను అటువైపు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
వాషింగ్టన్ డీసీలో భద్రత వైఫల్యం బయటపడటం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో ఇదే లోగాన్ సర్కిల్ ప్రాంతంలో అధ్యక్షుడికి చెందిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియెన్సీ' సభ్యుడిపైనే ఓ టీనేజర్ గ్రూప్ వేధింపులకు పాల్పడింది. ఆ ఘటన తర్వాత ట్రంప్ గారు ఎంతో ఆర్భాటంగా వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో 'ఫెడరల్ కంట్రోల్' జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. కట్ చేస్తే.. ఫెడరల్ కంట్రోల్ ఉన్న చోటే ఇప్పుడు ఐదుగురు బలైపోయారు.
ఇక ఇటీవల సోమవారం నాడు కూడా ట్రంప్ వైట్ హౌస్‌లో ఉండగానే అధ్యక్ష భవనం సమీపంలో కారు ప్రమాదం జరిగి లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. అప్పుడు సీక్రెట్ సర్వీస్, నేషనల్ గార్డ్ దళాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి.
ఇలా సొంత ఇంటి చుట్టూనే రక్షణ కవచం చిల్లులు పడుతుంటే ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటూ ట్రంప్ వేస్తున్న ప్రగల్భాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముందు సొంత గడ్డపై తుపాకీ సంస్కృతిని.. నేరాలను అదుపు చేసి.. ఆ తర్వాత ప్రపంచ పోలీస్ డ్యూటీ చేస్తే బాగుంటుందేమో ట్రంప్ సారూ.. జర సోచాయించండి..