ఎక్కడ తగ్గాలో.. తెలిసిన ప్రధాని మోడీ!
నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించారు. ఈ క్రమంలో రెండున్నర నెలల్లోనే కేంద్రం స్పందించింది.
సమస్యలు రావడం సహజం. అయితే.. ఆ సమస్యలను పరిష్కరించడంలోనే వ్యక్తుల నైపుణ్యం, దార్శని కత వంటివి ప్రస్ఫుటమవుతాయి. ఇలాంటి విషయాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను తాను ప్రతిసారీ నిరూపించుకుంటున్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా.. ఆందోళనలను సర్దుమణిగించేలా ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో మూడు వ్యవసాయ చట్టాల వ్యవహారం దేశాన్ని కుదిపేసినప్పుడు.. తాజాగా నీట్ పేపర్ లీక్ ఘటనపై విద్యార్థులు కదంతొ క్కినప్పుడు కూడా మోడీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారనడంలో సందేహం లేదు.
అప్పట్లో..
ప్రధాన మంత్రి రెండో టర్మ్‌లో వ్యవసాయానికి సంబంధించి మూడు కీలక చట్టాలను తీసుకువచ్చారు. రైతులకు గోదాముల నిర్వహణ, పంటల మార్పిడి, కొనుగోళ్లకు సంబంధించిన ఈ మూడు చట్టాలను పార్లమెంటులోనూ ఆమోదించుకున్నారు. ఆ నాడు అనేక పార్టీలు వీటికి మద్దతు కూడా ఇచ్చారు. అయితే.. వీటి వల్ల కార్పొరేట్లు.. వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి రైతుల జీవితాలను నాశనం చేస్తారన్న ఉద్యమం తెరమీదికి వచ్చింది. ఊరూ వాడా కదిలింది. రైతులు.. అహోరాత్రులు.. ఉద్యమించారు.
దాదాపు సంవత్సరం 8 నెలల పాటు సాగిన రైతుల ఉద్యమం..దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. అయితే.. ఆ సమయంలో ప్రధాని అంత త్వరగా దిగిరాలేదు. మూడు వ్యవసాయ చట్టాలను సమర్ధించుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు.. పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు.. రైతులకు నేతృత్వం వహించిన నాయకులను అరెస్టు చేశారు. ఢిల్లీ వీధుల్లోకి రాకుండా.. పంజాబ్, హరియాణ, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో భారీ గుంతలు తవ్వించారు.
అయినప్పటికీ.. రైతులు విశ్రమించలేదు. ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో ఏడాది 8 నెలల తర్వాత.. ప్రధాన మంత్రి.. హఠాత్తుగా జాతీయ మీడియా చానెల్ డీడీ ముందుకు వచ్చారు. రైతులను ఉద్దేశించి 8 నిమిషాల పాటు ప్రసంగించారు. తాము మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాలు తీసుకువచ్చామన్నారు. కానీ, రైతులకు సమగ్రంగా ఈ చట్టాల లబ్ధిని వివరించడంలో విఫలమయ్యామని అంగీకరించారు. క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. ఆ వెంటనే మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
తాజాగా..
నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించారు. ఈ క్రమంలో రెండున్నర నెలల్లోనే కేంద్రం స్పందించింది. అయితే.. అప్పటికి.. ఇప్పటికీ తేడా.. `యువత`. నాడు రైతులు మాత్రమే ఉద్యమిస్తే.. నేడు దేశవ్యాప్తంగా యువత రంగంలోకి దిగింది. ఫలితంగా వెనువెంటనే ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. మరోవైపు పార్లమెంటులో వరుసగా జరుగుతున్న వాయిదాల పర్వం కూడా.. కీలక బిల్లుల ఆమోదానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని గురువారం అర్ధరాత్రి 12.24 గంటల సమయంలో సెల్ఫీ వీడియో విడుదల చేసి.. నీట్ పరీక్ష బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కొత్త చట్టం తీసుకురానున్నట్టు చెప్పారు.