విశాఖలో ఫ్రీ షాప్.. నచ్చినవి తీసుకెళ్లొచ్చు
కొందరు స్నేహితులు కలిశారు. సమాజం నుంచి ఏం తీసుకోవాలన్న దాని కంటే.. సమాజానికి ఏం ఇవ్వాలన్న దాని గురించి ఆలోచించటం మొదలు పెట్టారు.;
కొందరు స్నేహితులు కలిశారు. సమాజం నుంచి ఏం తీసుకోవాలన్న దాని కంటే.. సమాజానికి ఏం ఇవ్వాలన్న దాని గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. కట్ చేస్తే.. ఫ్రీ బట్టల షాప్ ఒకటి స్టార్ట్ చేవారు. సరైన దుస్తులు లేనోళ్లు.. కొత్తవి కొనుక్కోలేక సాయం కోసం ఎదురుచూసే వారికి.. అలాంటి ఇబ్బంది అన్నదే లేకుండా చేయటమే ఈ ఫ్రీ వస్త్రాల షాప్. కొందరు కొత్త వస్త్రాలు కొంటారు కానీ వాడరు. ఆ తర్వాత వాటిని యూజ్ చేయాలని అనుకోరు. మరికొందరు తమకున్న దుస్తుల్ని అవసరమైన వారికి ఇచ్చేద్దామని భావించేటోళ్లు ఉంటారు. అలాంటోళ్లంతా ఒక చోటుకు చేరితే.. సరైన వస్త్రాలు లేక తెగ ఇబ్బంది పడేవారందరికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది.
సరిగ్గా ఇలానే ఆలోచించారు విశాకకు చెందిన విజయ్.. నీరజ అనే దంపతులు. వీరికి కొందరు స్నేహితులు జోడయ్యారు. తమకు వచ్చిన ఆలోచనను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే.. అనూహ్య స్పందన వచ్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబరులో ఫ్రీ షాప్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీరికి పలువురుఅండగా నిలవటం విశేషం.ఇప్పటివరకు 3వేల మందికి వారికి అవసరమైన వస్త్రాల్ని అందించిన క్రెడిట్ ఈ ఫ్రీషాప్ కాన్సెప్టు కొట్టేసింది.
ఇంతకూ విజయ్.. నీరజ దంపతులకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అందుకు దారి తీసిన కారణాల్లోకి వెళితే.. వారు ఒక ఎన్జీవో ద్వారా వైద్య శిబిరాలు.. ఇతర సేవా కార్యక్రమాల్ని నిర్వహించేవారు. పిల్లలు యుక్త వయసుకు రావటంతో వీరి సమయాన్ని సమాజానికి ఉపయోగపడే పనులకు వినియోగించుకోవాలని భావించారు. అక్కయ్యపాలెంలో పోర్టు స్టేడియం వెనుక ఉండే వీరి ఇంటి వద్ద ఒక చిన్న గదిని ఫ్రీ షాప్ పేరుతో స్టార్ట్ చేశారు. దీని ప్రత్యేకత ఏమంటే.. ఇది వారం రోజులు పని చేయదు. ఒక్క ఆదివారమే ఓపెన్ అవుతుంది.
ఆదివారం వచ్చిందంటే చాలు.. ఉదయం ఏడు గంటలే ఈ ఫ్రీ షాప్ ఓపెన్ అవుతుంది. ఈ షాప్ నకు వచ్చినోళ్లు ఎవరైనా సరే.. తమకు నచ్చిన ఏదైనా ఒక వస్తువును తీసుకోవచ్చు. తొలుత వస్త్రాలతో మొదలైన ఈ షాప్ కు పలువురు దాతలు.. ఎలక్ట్రికల్ వస్తువులు.. వంట వస్తువులు.. ఫ్యాన్లు.. షూస్.. ఇలా పలు రకాల వస్తువుల్ని ఇవ్వటం మొదలైంది. తొలుత వస్త్రాల్ని ఇవ్వాలనుకున్న వారు.. తామే షాప్ కు రావాల్సి ఉండేది. ఇప్పుడు దాతలు ఎవరైనా చెబితే.. వీరే వారింటికి వెళ్లి వస్త్రాల్ని కలెక్టు చేసుకోవటంతో పాటు.. వాటిని శుభ్రంగా వాష్ చేసి.. ఇస్త్రీ చేసి.. హ్యాంగ్ చేస్తుంటారు. చుట్టూ ఉన్న సమాజానికి ఈ తరహా సాయం కొత్త తరహా స్ఫూర్తికి కారణమవుతుందని మాత్రం చెప్పక తప్పదు. మీరేమంటారు?