వైసీపీలో ఏవీ నాటి వెలుగులు ?
ఇదిలా ఉంటే వైసీపీలో క్యాడర్ కి పార్టీకి మధ్య అంతరం బాగా పెరిగిపోతోంది అని అంటున్నారు. పార్టీని ఏకతాటి మీద నడిపించే నాధుడు లేడు అన్న చర్చ కూడా సాగుతోంది.;
వరసగా రెండు ఎన్నికల్లో నెత్తిన పెట్టుకున్న జిల్లా బాగా నమ్ముకున్న జిల్లా 2024 ఎన్నికల్లో వైసీపీకి హ్యాండ్ ఇచ్చింది. అలా అనేకంటే వైసీపీ చేసిన స్వీయ తప్పిదాలే కారణం అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. వైసీపీకి గ్రేటర్ రాయలసీమలో హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్ గా ఉన్న ప్రకాశం ఇపుడు కాంతులు తగ్గి కలవరపెడుతోంది. వైసీపీ అధినాయకత్వం తగిన మరమ్మతులు చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తోంది అని అంటున్నారు.
ఒక వెలుగు వెలిగి :
ప్రకాశం జిల్లాలో వైసీపీకి మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు అంతా వైసీపీలో జెండా మోసారు. పార్టీని పటిష్టం చేశారు. దాంతో 2014 ఎన్నికల్లో వైసీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గానూ 5 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభావం బలంగా ఉన్న వైసీపీ ఈ ఫలితాలను సాధించింది. ఇక 2018 ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది సీట్లను గెలుచుకుంది. అయితే 2024 కి వచ్చేసరికి కేవలం 2 సీట్లకే పరిమితం అయింది. పైగా ఎంపీ సీటు కూడా కోల్పోయింది.
బలమైన నేతలు కరవు :
వైసీపీకి ఇపుడు బలమైన నేతలు కరవు అయ్యారని అంటున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరి గెలిచి లోక్ సభలో ఉన్నారు అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే వైసీపీ నుంచి జనసేనలో చేరిపోయారు. అనేక మంది నాయకులు ఎన్నికల ముందే పార్టీలు మారారు. ఇక్కడ జనసేన టీడీపీ కూటమి బలంగా ఉంది. పది సీట్లు ఒక ఎంపీ సీటుతో పటిష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
నడిపించే నాధుడేడీ :
ఇదిలా ఉంటే వైసీపీలో క్యాడర్ కి పార్టీకి మధ్య అంతరం బాగా పెరిగిపోతోంది అని అంటున్నారు. పార్టీని ఏకతాటి మీద నడిపించే నాధుడు లేడు అన్న చర్చ కూడా సాగుతోంది. వైసీపీ ఓటమి చెందాక జిల్లా నాయకత్వంలో మార్పు చేశారు. దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించినా అంతగా పార్టీని ప్రభావితం చేయలేక పోతున్నారు అని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియా ముందుకు అపుడపుడు వస్తున్నా క్యాడర్ బేస్డ్ పాలిటిక్స్ అయితే కనిపించడం లేదని అంటున్నారు. జిల్లాలో పెద్ద నాయకుడిగా ఉన్న రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అయితే పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఓటమి చెంది ఇరవై నెలలు గడుస్తునా వైసీపీలో అయితే నైరాశ్యం పోవడం లేదు, పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళే సరైన నాయకత్వం కావాలని కోరుతున్నారు. మరి అధినాయకత్వం ప్రకాశం మీద దృష్టి పెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు.