వాషింగ్టన్ ఔట్.. టీమిండియాలోకి యువకెరటం

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని పరిణామం ఎదురైంది;

Update: 2026-01-13 06:35 GMT

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని పరిణామం ఎదురైంది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా అతని స్థానంలో ఐపీఎల్ సంచలనం ఆయుష్ బదోనీని సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. 2026 క్యాలెండర్ ఇయర్లో భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి కొత్త ఆటగాడిగా బదోనీ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

సుందర్‌కు గాయం.. బదోనీకి లక్!

వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. కేవలం ఐదు ఓవర్లు వేసిన అనంతరం మైదానాన్ని వీడిన సుందర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. పరీక్షల అనంతరం మెడికల్ టీమ్ అతనికి విశ్రాంతి అవసరమని సూచించడంతో బీసీసీఐ అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆయుష్ బదోనీ వైపు మొగ్గు చూపింది.

ఎవరీ ఆయుష్ బదోనీ?

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఫినిషర్‌గా బదోనీ తనదైన ముద్ర వేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి ఆడే తత్వం అతడి సొంతం. 46 ఇన్నింగ్స్‌ల్లో 963 పరుగులు చేశాడు. 6 అర్ధ సెంచరీలు చేయడమే కాకుండా అవసరమైనప్పుడు వికెట్లు తీయగల సమర్థుడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయగలగడం అతనికి అదనపు బలంగా మారింది.

గాయాల గుప్పిట్లో టీమ్ ఇండియా

ప్రస్తుతం భారత జట్టును గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడగా అతని స్థానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది.

రాజ్‌కోట్ వన్డేపై కన్నేసిన అభిమానులు

తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (94) క్లాసిక్ ఇన్నింగ్స్, శుభ్‌మన్ గిల్ (56) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ నిర్ణయాత్మకమైన రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.

వాషింగ్టన్ సుందర్ స్థానంలో వచ్చిన బదోనీ నేరుగా తుది జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడా? లేక బెంచ్‌కే పరిమితం అవుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News